మండలి రద్దుకు ఎంత మేర అవకాశాలు ఉన్నాయి...

మండలి కొనసాగించాలా వద్దా అన్న అంశం పై ఏపీ సర్కారు తీవ్రంగా ఆలోచిస్తోంది. అసెంబ్లీలో జరిగిన చర్చలో కూడా ఈ మండలి మనకు అవసరమా అన్నట్టు మంత్రులు వారి భావనను తెలిపారు. దీంతో సీఎం కూడా మండలి కొనసాగించాలా వద్దా అనేది సోమవారం అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుందామన్నారు. దీంతో మండలి భవిష్యత్ ఏం కాబోతోంది అనే చర్చ మొదలైంది. ఏపీ వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీయే రద్దు బిల్లులు మండలికి వచ్చిన తరువాత అనేక నాటకీయ పరిణామాలు జరిగాయి. ఎలాగైనా బిల్లుల్ని అడ్డుకోవాలని వ్యూహాల్లో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబు తన దగ్గరున్న వ్యూహాలన్ని అమలు చేసేందుకు సాయశక్తులా ప్రయత్నించారు. అందులో భాగంగానే వ్యూహాత్మకంగా రూల్ 71 ను తెరపైకి తెచ్చి దాని నెగ్గించుకున్నారు. తర్వాత మండలిలో రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపే వరకు వ్యూహాలను పకడ్బందీగా అమలు చేయడంలో టిడిపి సక్సెస్ అయింది. 

ప్రభుత్వం ముందు కేవలం రెండు సమాధానాలు కనిపిస్తున్నాయి.ఒకటి ఆర్డినెన్స్ తేవడం, రెండోది శాసనమండలిని రద్దు చేయడం లేకుంటే సెలక్ట్ కమిటీ నిర్ణయం వచ్చేంత వరకు వేచి చూడడం, కానీ ఇవేమీ అంత సులువు కాదని సమాచారం.ముందుగా సెలక్ట్ కమిటీ ప్రక్రియ పరిశీలిస్తే అసెంబ్లీ రూల్స్ ప్రకారం సెలెక్ట్ కమిటీకి పంపిన ఏ బిల్లులైనా కనీసం నెల రోజుల పాటు ఆగుతాయి. అత్యధికంగా 3 నెలల పాటు ఆపొచ్చు, కనీసం నెల రోజుల పాటు ఏపీ సర్కార్ వేచి ఉండాల్సి ఉంది. ఒకవేళ సెలెక్ట్ కమిటీ మార్పులూ చేర్పులూ సూచిస్తే మళ్లీ అసెంబ్లీ, శాసన మండలిలో చర్చించి ఆమోదం పొందాలి. ఇది ఒక సమాధానం ఐతే రెండో ఆప్షన్ ఆర్డినెన్స్ తీసుకురావడం సెలక్ట్ కమిటీకి బిల్లులు పంపకుండా నేరుగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి మూడు రాజధానులను ఏర్పాటు చేయటం. ఏదైనా ఆర్డినెన్స్ తీసుకొస్తే దాన్ని ఆరు నెలల్లోపు చట్టం చేసుకోవచ్చు, వచ్చే బడ్జెట్ సమావేశాల్లోపు దాన్ని ఆమోదించుకోవచ్చు. ముందుగా అసెంబ్లీని ప్రోరోగ్ చేయాలి కానీ అక్కడ మరో మెలిక కూడా ఉంది. ఆర్డినెన్సు తీసుకురావాలంటే ఏదైనా బిల్లు ఆమోదం పొందకపోతే దాని స్థానంలో ఆర్డినెన్సు తీసుకు రావాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ రెండు బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపడం అంటే ఈ రెండు బిల్లులు సజీవంగా ఉన్నట్లే, రూల్స్ ప్రకారం ఆర్డినెన్స్ తీసుకురావడం కుదిరే పని కాదని తెలుస్తోంది. 

ఇక శాసన మండలి రద్దు. ఇదొక సుదీర్ఘ ప్రక్రియ, ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో తీసుకునే నిర్ణయం కాదు కేంద్రం అనుమతి కూడా కావలసి ఉంటుంది. ముందుగా మండలిని రద్దు చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరుతూ స్టేట్ కేబినెట్ తీర్మానం చేయాలి, దానిని శాసన సభ ఆమోదంతో కేంద్రానికి పంపించాలి. రాష్ట్ర ప్రభుత్వ తీర్మానాన్ని కేంద్రం ఆమోదిస్తే పార్లమెంట్ లో బిల్లు పెట్టి చట్టం చేయాల్సి ఉంటుంది. కేంద్ర చట్టం ద్వారా మాత్రమే శాసనమండలిని రద్దు చేయగలరు, ఈ ప్రక్రియ ముగియడానికి కనీసం ఏడాది పట్టే అవకాశముంది. ప్రస్తుతం ఏం జరగవచ్చని పరిశీలిస్తే బిల్లులు సెలెక్ట్ కమిటీకి పంపడంతో ముందుగా కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కమిటీ చైర్మన్ ను సభ్యులను నియమించడంతో పాటు కాలపరిమితి విధి విధానాల ఖరారు చేయాల్సి ఉంది. వీటి పై మండలి చైర్మన్ నిర్ణయం తీసుకుంటారు.మండలిలో పార్టీల బలాబలాల ఆధారంగా కమిటీలో ప్రాతి నిధ్యం ఉంటుంది. శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ సభ్యుల సంఖ్య ఎక్కువ కాబట్టి కమిటీలో మెజార్టీ సభ్యులు ఆ పార్టీ నుంచే ఉంటారు.కమిటీ ఆ బిల్లులను పరిశీలించి నివేదిక అందజేయటానికి కనీసం మూడు నెలల సమయం పట్టే అవకాశముంది. ఎటు చూసినా సమయం మూడు నెలల నుంచి ఏడాది పట్టే అవకాశం ఉండటంతో ప్రభుత్వం న్యాయ నిపుణులను సంప్రదిస్తోంది. దీని పై ఏపీ సర్కార్ ఏ నిర్ణయం తీసుకోబోతుంది అనేది సోమవారం తేలనుంది.