జగన్ చేతిలో మండలి భవిష్యత్తు...

 శాసన మండలి రద్దు దిశగా వైసీపీ ప్రభుత్వం సీరియస్ గా అడుగులు వేస్తోంది.ఏపీ శాసన మండలి రద్దు చేసే దిశగా ముఖ్యమంత్రి జగన్ సంచలన ప్రతిపాదన చేశారు. సోమవారం సభ నిర్వహించి మండలి కొనసాగింపు పై చర్చిద్దామని స్పీకర్ ను కోరారు. శాసన మండలిలో బుధవారం జరిగిన పరిణామాల తన మనసును ఎంతగానో బాధించాయని సీఎం అసెంబ్లీలోనే మేధావుల ఉండగా మండలి అవసరమా అంటూ ప్రశ్నించారు.పాలన వికేంద్రీకరణ సీఆర్ డీఏ బిల్లును మండలి సెలెక్ట్ కమిటీకి పంపించటంపై అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు. మండలి ఉండాలా వద్దా అన్న దానిపై తుది నిర్ణయం తీసుకునేందుకు సోమవారం అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చ పెట్టాలని ఆ రోజు నిర్ణయం తీసుకుందామని స్పీకర్ తమ్మినేని సీతారాంను సీఎం కోరారు.దానిని స్పీకర్ సానుకూలంగా స్పందించారు. 27వ తేదీ ఉదయం 11 గంటలకు సభను సమావేశపరుస్తున్నట్లు ప్రకటించారు.

ఎన్నికల్లో గెలవాలనుకున్న చట్టసభల్లో మేధావులకు ప్రాతి నిధ్యం ఉండాలన్న ఉద్దేశంతో మండలిని ఏర్పాటు చేశారని అసెంబ్లీలోనే మేధావులూ డాక్టర్లు, పోస్టు గ్రాడ్యుయేట్లు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, రైతులు పాత్రికేయులు విదేశాల నుండి తిరిగొచ్చినవారూ అందరూ ఉన్నప్పుడు ఇక మండలి అవసరమా అని అభిప్రాయపడ్డారు సీఎం.ఎస్సీ ఎస్టీ కమిషన్ బిల్లు తిరస్కరించారు. ఆంగ్ల మాధ్యమం బిల్లును టిడిపి శాసన సభలో సమర్థిస్తే ఆ పార్టీ వాళ్లే మండలిలో వ్యతిరేకించారని రాజకీయ దురుద్దేశంతో ఉన్న మండలి అవసరమా అని  జగన్ నిలదీశారు. మండలి చైర్మన్ షరీఫ్ సెలెక్ట్ కమిటీ నిర్ణయం సందర్భంగా చేసిన ప్రసంగం వీడియోను అసెంబ్లీలో ప్రదర్శించారు. ఆ ప్రసంగం విన్నాక ముఖ్యమంత్రి మళ్లీ మాట్లాడుతూ ఏ బిల్లు కైనా సవరణలు సూచనలు చేయొచ్చు, నచ్చక పోతే తిరస్కరించొచ్చు కానీ నిబంధనలకు విరుద్ధంగా సెలెక్ట్ కమిటీకి పంపించటం తప్పని అభిప్రాయపడ్డారు.

మండలి పరిణామాలతో తన మనసు చాలా బాధపడిందని జగన్ తెలిపారు.పేద రాష్ట్రం లో ఏటా 60 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన శాసనమండలి ఉండాలా, రద్దు చేయాలా అని ప్రశ్నించారు జగన్.  ముఖ్యమంత్రి ఎక్కడి నుంచైనా పాలన చేయొచ్చు నని, రాజ్యాంగంలో రాజధాని అన్న పదమే లేదని కేవలం పాలనా స్థానం అని మాత్రమే ఉందని చెప్పుకొచ్చారు జగన్.ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడి నుంచే పాలన సాగుతోందని దానికి ఏ చట్టం ఏ బిల్లు అవసరం లేదని ఆయన వెల్లడించారు.మొత్తానికి సోమవారం రోజు మండలి భవిష్యత్తు పై ఏదో ఒకటి తేల్చాలని  సీఎం జగన్ గట్టి నిర్ణయం తీసుకున్నారు, ఈ విషయంలో జగన్ ఎలాంటి వ్యూహం అమలు చేస్తారనేది సర్వత్రా ఉత్కంఠత రేపుతోంది.