జగన్ హామీలకే దిక్కు లేదా? మాట తప్పం...మడం తిప్పమనేది ఉత్తుత్తి మాటలేనా?

రాజకీయ నాయకులు ఎన్నికల్లో గెలిచేందుకు ఎన్ని హామీలైనా ఇస్తారు... గెలిచాక ముఖం చాటేస్తారు... ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల ప్రకటనలను... నేతల హామీలను నమ్మి... ప్రజలు మోసం పోవడం కామన్... అదే, పరిస్థితి రాజకీయ నేతలకు ఎదురైతే... అప్పుడు తెలుస్తుంది ఆ బాధేంటో... వైసీపీలో కొందరు పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది... తొమ్మిదేళ్లుగా వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం కష్టపడిన కొందరిని వివిధ హామీలిస్తూ జగన్మోహన్ రెడ్డి టికెట్ నిరాకరించారు. అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇస్తానని... లేదా నామినేటెడ్ పోస్ట్ కట్టబెడతానని హామీ ఇచ్చారు. ఇక కొందరికైతే ఏకంగా మంత్రి పదవినే ఆఫర్ చేశారు. వీళ్లలో కొందరికి వ్యక్తిగతంగా చెప్పగా, మరికొందరికైతే బహిరంగంగా ప్రజలు ముందే హామీ ఇచ్చారు. 

జగన్ అనుకున్నట్లే వైసీపీ అధికారంలోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడే ఆర్నెళ్లు కూడా గడిచిపోయాయి. కానీ, జగన్ నుంచి హామీలు పొందినవాళ్ల పరిస్థితే అగమ్యగోచరంగా మారింది. కనీసం వాళ్లకు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదని అంటున్నారు. ఇలాంటి బాధితుల బాధితుల జాబితా వైసీపీలో ఎక్కువగానే ఉంది. ఈ లిస్ట్ లో  గుంటూరు జిల్లా చిలకలూరిపేట నేత మర్రి రాజశేఖర్ ఒకరు. ఎన్నికలకు ముందువరకు మర్రి రాజశేఖరే చిలకలూరిపేట వైసీపీ అభ్యర్ధిగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఒకసారి పోటీచేసి ఓడిపోయారు. అయితే, ఎన్నికలకు ముందు అనూహ్యంగా మర్రిని తప్పించి ఎన్నారై విడదల రజనీకి టికెట్ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో బహిరంగంగా మర్రికి మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. అయితే, కేబినెట్ లో చోటు దక్కలేదు. అయితే, రెండున్నరేళ్ల తర్వాత 90శాతం కేబినెట్ ను మార్చేస్తానని జగన్ చెప్పడంతో.. మరి రెండో విడతలో అవకాశమిస్తారో లేక ఆ హామీనే పక్కనబెడతారో చూడాలి. 

ఇక, గుంటూరు వెస్ట్ లేళ్ల అప్పిరెడ్డిదీ ఇదే పరిస్థితి. అప్పిరెడ్డికి కూడా ఎమ్మెల్సీ లేదా నామినేటెడ్ పదవి ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు కనీసం జగన్ నుంచి పిలుపే రాలేదు. అదేవిధంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై కుప్పంలో పోటీచేసి ఓడిపోయిన చంద్రమౌళి పరిస్థితి మరీ దారుణంగా ఉందంటున్నారు. చంద్రబాబుపై పోటీ అంటే ఆశలు వదులుకుని బరిలోకి దిగాల్సిందే. అయితే, వైసీపీ అధిష్టానం చంద్రమౌళిని టెంప్ట్ చేసి పెద్దఎత్తున నిధులు ఖర్చు పెట్టించిందని అంటున్నారు. ఎన్టీఆరే ఓడిపోయిన సందర్భాలున్నాయని, నీవు కూడా చంద్రబాబును ఓడిస్తావంటూ భారీగా డబ్బు ఖర్చు పెట్టించారని, దాంతో చంద్రమౌళికి దాదాపు రోడ్డునపడిన పరిస్థితి వచ్చిందంటున్నారు. ఓడిపోయినాసరే, ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇస్తానని చంద్రమౌళికి కూడా జగన్ హామీ ఇచ్చారట. కానీ, ఇప్పుడు జగన్ దర్శన భాగ్యం కూడా దొరకడం లేదని వాపోతున్నట్లు తెలుస్తోంది. ఇక, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పై అనూహ్య విజయం సాధించిన మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిదీ ఇదే పరిస్థితి. ఆర్కేను గెలిపిస్తే మంత్రిని చేస్తానంటూ బహిరంగంగా ప్రజల ముందే జగన్ ప్రకటించారు. తీరా చూస్తే కేబినెట్లో ఆర్కేకి చోటు దక్కలేదు. ఇక, ప్రకాశం జిల్లా పర్చూరులో గొట్టపాటి భరత్ దీ కూడా ఇదే పరిస్థితి. చివరి నిమిషంలో దగ్గుబాటి వెంకటేశ్వర్రావుకి టికెట్ కేటాయిండంతో... గొట్టిపాటి భరత్ కు ఎమ్మెల్సీ ఇస్తానంటూ హామీ ఇఛ్చారు. అయితే, ఇప్పుడు జగన్ అపాయింట్ మెంట్ కూడా దొరకడం లేదని అంటున్నారు.

వీళ్లందరి పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్లు ఉందంటున్నారు. తమకిచ్చిన హామీలపై జగన్ ను నిలదీయలేక... కనీసం తమకు ఎప్పుడు న్యాయం చేస్తారని అడగలేక... తమలో తామే కుమిలిపోతున్నారని చెప్పుకుంటున్నారు. అయితే, జగన్ మాటిస్తే తప్పడని, కొంచెం ఆలస్యమైనా, తమకిచ్చిన హామీని నిలబెట్టుకుంటారనే ఆశతో ఎదురుచూస్తూ గడిపేస్తున్నారు. మరి వీళ్ల టైమెప్పుడు వస్తుందో... ఎప్పుడు పదవులు దక్కుతాయో చూడాలి.