శ్రీనివాసరావు కస్టడీకి నిరాకరించిన కోర్టు

 

ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌సిపి అధినేత జగన్ పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావును పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. గత వారం రోజులుగా అతన్ని సిట్ బృందం విచారిస్తున్న విషయం తెలిసిందే.అయితే కోర్టు విధించిన ఆరు రోజుల కస్టడీ గడువు ఇవాళ ముగియడంతో పోలీసులు భారీ భద్రత మధ్య అతడిని న్యాయస్థానంలో హాజరుపరిచారు. శ్రీనివాస్‌ కస్టడీని పొడిగించాలని సిట్‌ అధికారులు కోరగా.. అందుకు న్యాయమూర్తి నిరాకరించారు.శ్రీనివాస్‌కు రిమాండ్‌ కొనసాగించాలని ఆదేశించారు.దీనిపై విమానాశ్రయ పీఎస్‌ సీఐ శేషు మాట్లాడుతూ.. శ్రీనివాస్‌ కస్టడీ ముగియడంతో కోర్టులో హాజరు పరిచినట్టు తెలిపారు. ఈ నెల 11 వరకు శ్రీనివాస్‌ రిమాండ్‌కు న్యాయస్థానం ఆదేశించిందని చెప్పారు. కోర్టు ఆదేశాలతో శ్రీనివాస్‌ను కేంద్ర కారాగారానికి తరలించినట్టు ఆయన వెల్లడించారు.అయితే, ఇప్పటివరకు నిందితుడి కాల్‌డేటా ఆధారంగా పోలీసు విచారణ కొనసాగింది. కేసుకు బలమైన ఫోరెన్సిక్‌ నివేదిక ఇంకా అందకపోవడంతో ఈ కేసులో ఆశించిన పురోగతి సాధించలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.దీంతో నిందితుడికి కస్టడీ పొడిగించాలని పోలీసులు న్యాయస్థానాన్ని కోరగా.. అందుకు న్యాయస్థానం నిరాకరించింది.