యువ ఓటర్లదే ఇక రాజ్యం

 

 

 

లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో యువత ఓటే కీలకం కానుంది. రాష్ట్ర ఓటర్ల సంఖ్యలో సగానికిపైగా యువ ఓటర్లే ఉన్నారు. మొత్తం 6.23 కోట్ల మంది ఓటర్లుండగా.. అందులో 3.52 కోట్ల మంది యువతే. ఇటీవల కేంద్ర ఎన్నిల కమిషన్‌తో పాటు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ ఓటర్ల జాబితా సవరణ ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఓటర్ల జాబితా బయట ఉన్న యువతను జాబితాలోకి తీసుకురావడానికి అనేక చర్యలను చేపట్టారు. దీంతో కొత్తగా 76 లక్షల మంది ఓటర్లుగా నమోదయ్యారు.


రాష్టంలో మహిళా ఓటర్ల సంఖ్య తగ్గిపోయి, పురుష ఓటర్ల సంఖ్య పెరిగింది. గత ఏడాది జనవరిన ప్రకటించిన ఓటర్ల జాబితాలో 2.90 కోట్ల మంది పురుష ఓటర్లుండగా మహిళా ఓటర్లు 2.92 కోట్ల మంది ఉన్నారు. గత ఏడాది సెప్టెంబర్ నాటికి ఆ సంఖ్య తలకిందులైంది. ఇంటింటి ఓటర్ల జాబితా తనిఖీల అనంతరం పురుష ఓటర్లు పెరిగిపోయారు. మహిళా ఓటర్లు ఏకంగా నాలుగు లక్షల మంది తగ్గిపోయారు. ప్రస్తుతం పురుష ఓటర్లు 3.13 కోట్ల మంది ఉండగా మహిళా ఓటర్లు 3.10 కోట్ల మంది ఉన్నారు. అంటే పురుష ఓటర్ల కన్నా మహిళా ఓటర్లు సంఖ్య మూడు లక్షలు తక్కువ.