యోగాకి వెళ్ళాల్సింది ఎవరు?

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం నాడు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు జిగ్గీ వాసుదేవ్ అనే గురువుగారు నిర్వహించే యోగా, మెడిటేషన్ క్యాంపులో జాయిన్ అయ్యారు. ఈ క్యాంపులో మూడు రోజులపాటు వీరందరూ యోగా, మెడిటేషన్లో శిక్షణ తీసుకుంటారు. తద్వారా ఆలోచనలో క్లారిటీ వస్తుంది... ఏకాగ్రత పెరుగుతుంది... ఇంకా ప్రతిభావంతంగా పనిచేయడానికి వీలవుతుంది. చంద్రబాబు నాయుడు పదేళ్ళ క్రితం ముఖ్యమంత్రిగా వున్నప్పుడు కూడా ఇలాగే అధికారులు, మంత్రులకు యోగా, మెడిటేషన్ క్యాంపులు ఏర్పాటు చేసి మంచి ఫలితాలు సాధించారు. ఇప్పుడూ అలా సాధిస్తారు... అందులో ఎలాంటి సందేహం లేదు.. చెప్పాలంటే... చంద్రబాబు టీమ్ ఇలాంటి యోగా క్యాంపుల్లో చేరకపోయినా ప్రతిభావంతగానే పనిచేస్తారు.. ప్రస్తుతం చేస్తూనే వున్నారు. వారి కృషిని ఈ క్యాంపు మరింత పెంచితే కావలసిందేమీ లేదు. అయితే నిజానికి యోగా క్యాంపుకు వెళ్ళాల్సింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు, అధికారులు కాదు... వేరేవాళ్ళు... వాళ్ళెవరో ఇప్పుడు చూద్దాం.

 

అందరికంటే ముందుగా యోగా క్యాంపుకి పంపించాల్సిన వ్యక్తి వైసీపీ నాయకుడు జగన్. గత ఎన్నికల తర్వాత అధికారం దక్కితే మరికాస్త సంపాదించుకుందామని, తన మీద వున్న కేసుల నుంచి తప్పించుకోవాలని కలలు కన్న జగన్... తన కలలు కల్లలయ్యేసరికి బాగా డిప్రెషన్‌లో పడిపోయాడు. ఫస్ట్రేషన్‌తో అల్లాడిపోతున్నాడు. కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా ఆంధ్రప్రదేశ్‌ని విభజిస్తే, రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి నిరంతరం శ్రమిస్తున్న చంద్రబాబు నాయుడు మీద రకరకాల విచిత్రమైన ఆరోపణలు చేస్తూ కంగాళీ చేస్తున్నాడు. ప్రపంచం ముందు తలెత్తుకుని నిలబడగలిగే విధంగా రాజధానికి చంద్రబాబు రూపకల్ప చేస్తుంటే, అక్కడ అడ్డు పుల్లలు వేస్తూ తన సంకుచిత స్వభావాన్ని బయట పెట్టుకుంటున్నాడు. మనసంతా పొల్యూట్ అయినట్టుగా వ్యవహార శైలిని ప్రదర్శిస్తున్నాడు. అలాంటి జగన్ని యోగా, మెడిటేషన్ క్యాంపులకు పంపడం పంపడం వల్ల డిప్రెషన్, ఫస్ట్రేషన్ తగ్గిపోయి, ఆయనలో మార్పు వచ్చి, బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరిస్తారు.

 

జగన్‌తోపాటు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సార్ని కూడా క్యాంపుకి పంపించాలి. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ని సర్వనాశనం చేసింది. తెలంగాణలో అధికారంలో కోసం కాంగ్రెస్ పార్టీ తెలుగు జాతిని చీల్చుతుంటే ఎంటర్‌టైన్‌మెంట్ చూసిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులలో రఘువీరా కూడా ఒకరు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇక బతికే అవకాశం లేదని తెలిసినా, అధికార పార్టీ మీద బురద జల్లుతూ రాజకీయంగా లాభం పొందాలని దురాశాపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఈయన్ని యోగా క్యాంపుకి పంపిస్తే దురాశ తగ్గి, వాస్తవ పరిస్థితి అర్థమై ఆయన ప్రశాంతంగా వుండి, రాష్ట్ర ప్రజల్ని ప్రశాంతంగా వుంచుతారు.

 

వీళ్ళిద్దర్నే కాకుండా మాదీ మాకే కావాలి.. మీది కూడా మాకే కావాలని అంటూ కయ్యానికి కాలు దువ్వుతున్న కొంతమంది పెద్దమనుషులను కూడా యోగా క్యాంప్‌కి పంపిస్తే ఓ పనైపోతుంది.