వైసీపీకి 3 కేబినెట్ బెర్తులు... ఆ ముగ్గురికి ఛాన్స్..!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ... ఎన్డీఏలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. కేంద్ర హోంమంత్రి అమి త్ షా, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశంలో దీనిపైనే చర్చ జరిగిందనే టాక్ వినిపిస్తోంది. ఎన్డీఏలో చేరితే... వైసీపీకి ఇవ్వనున్న కేంద్ర కేబినెట్ బెర్తులపై జగన్ కు అమిత్ షా వివరించినట్లు చెబుతున్నారు. ఇరువురి మధ్య అరగంటపాటు జరిగిన సమావేశంలో ఎన్డీఏలో చేరాలని జగన్ ను అమిత్ షా ఆహ్వానించారని ప్రచారం జరుగుతోంది. అలాగే, ఒక కేబినెట్ ర్యాంకు... రెండు ఎంవోఎస్ మంత్రి పదవులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

ఎన్డీఏ అండ్ కేంద్ర కేబినెట్లోకి వైసీపీ చేరుతుందన్న ప్రచారం నేపథ్యంలో ప్రముఖంగా ముగ్గురి పేర్లు వినిపిస్తున్నాయి. విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, అలాగే నందిగం సురేష్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. విజయసాయిరెడ్డికి కేబినెట్ ర్యాంక్ తోనూ... మిథున్ రెడ్డి, నందిగం సురేష్ కు సహాయ మంత్రి పదవులు దక్కనున్నాయని చెబుతున్నారు. అయితే, విజయసాయిరెడ్డిపై సీబీఐ అండ్ ఈడీ కేసులు ఉండటంతో ఆయనను కేబినెట్లోకి తీసుకోకపోవచ్చనే మాట కూడా వినిపిస్తోంది. ఒకవేళ, విజయసాయికి బెర్త్ దక్కకపోతే ఎస్సీ లేదా బీసీ మహిళకు అవకాశం దక్కొచ్చని చెబుతున్నారు.

భవిష్యత్ రాజకీయ అవసరాల కోసమే, వైసీపీని ఎన్డీఏలోకి బీజేపీ ఆహ్వానిస్తోందని ప్రచారం జరుగుతోంది. రాజ్యసభలో వైసీపీకి పెరగనున్న బలం నేపథ్యంలోనే బీజేపీ అగ్రనాయకత్వం ఆ దిశగా ఆలోచన చేస్తోందని అంటున్నారు. ఏదిఏమైనా ఇరు పార్టీలూ భవిష్యత్ అవసరాలు, పరస్పర లబ్ది చూసుకునే అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.