హిందూపురం వైసీపీలో ముదిరిన పోరు.. పార్టీ నేత హనుమంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ ఇక్బాల్ దాడి

అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ సెగ్మెంట్ లో వైసీపీ నేతల విభేదాలు తారాస్దాయికి చేరుకున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలో అనైక్యత కారణంగా ఓటమిపాలైన వైసీపీకి, ఎన్నికల తర్వాత కూడా ఇంటిపోరు తప్పడం లేదు. తాజాగా హిందూపురం నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు సంబంధించి ఏర్పడిన విభేదాలు వ్యక్తిగత దాడుల వరకూ వెళ్లాయి. అభివృద్ధి పనుల కేటాయింపుకు సంబంధించి తనను ప్రశ్నించేందుకు వచ్చిన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కొట్టి హనుమంతరెడ్డిపై ఎమ్మెల్సీ ఇక్బాల్ దాడి చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది.

కోటిపి గ్రామంలో తనకు కనీస సమాచారం లేకుండా ఎవరెవరో వచ్చి పనులు చేసుకుంటున్నారని తెలిసిన హనుమంతరెడ్డి .. నియోజకవర్గం ఇన్ ఛార్జి గా ఉన్న ఇక్బాల్ ను ప్రశ్నించేందుకు ప్రశాంతి నగర్ లోని వైసీపీ కార్యాలయానికి వెళ్లారు. అదే సమయంలో అక్కడే ఉన్న ఇక్బాల్ తనను చూసిన వెంటనే ఉన్నపళంగా కుర్చీలోంచి లేచి పార్టీకి నీలాంటి వాళ్ల అవసరం లేదంటూ ముఖంపై పిడిగుద్దులు కురిపించారని హనుమంతరెడ్డిని పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళతానని హనుమంతరెడ్డి తెలిపారు. హిందూపురంలో టీడీపీ బలంగా ఉండటంతో పాటు వరుసగా అక్కడి నుంచి సినీ నటుడు బాలకృష్ణ గెలుస్తుడటంతో వైసీపీ ఇక్కడ బలహీనంగా కనిపిస్తోంది. అదే సమయంలో పార్టీలో అంతర్గత తగాదాలు వైసీపీ పరువు తీస్తున్నాయని నేతలు వాపోతున్నారు.