మమ్మల్ని డమ్మీ ఎమ్మెల్యేలను చేశారంటూ తెగ ఫీలైపోతున్న వైసీపీ ఎమ్మెల్యేలు!!

2014 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పోల్చితే 2019 అసెంబ్లీ ఎలక్షన్స్ తో విజయనగరం జిల్లా రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. తొమ్మిదికి తొమ్మిది స్థానాలను వైసీపీ గెలుచుకుంది, ఇంకేముంది పార్టీ కూడా అధికారంలోకి రావడంతో చక్రం తిప్పాలని అనుకున్నారు ఎమ్మెల్యేలు. గత ప్రభుత్వ హయాంలో ఏ విధంగా అయితే టిడిపి నేతల హవా నడిచిందో అదే విధంగా చేద్దామని వీళ్లు కూడా భావించారు కానీ, వారి ఆశలు అడియాసలయ్యాయట. 

2014 ఎన్నికల్లో జిల్లాలో టిడిపి ఆరు, వైసిపి మూడు చోట్ల గెలిచింది. సుజయ కృష్ణ రంగారావు టిడిపిలో చేరి మంత్రి అయ్యారు, అప్పట్లో టిడిపి ఎమ్మెల్యేలు ఏది చెబితే అది జరిగేది అని అంటారు. పింఛన్ లు, ఇళ్ల కేటాయింపులు, వెనుకబడిన తరగతులకు లోన్లు, ఔట్ సోర్సింగ్ నియామకాల్లో టిడిపి శాసన సభ్యుల హవా నడిచేదట. వైసిపి ఎమ్మెల్యేలున్న చోట కూడా టిడిపి నేతలు చెప్పినదానికే అధికారులు ఊ కొట్టేవారట. ఇదంతా చూసిన వైసీపీ నేతలు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇలాగే చేయాలని కలలు కన్నారు. అయితే సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రజాప్రతినిధుల పాత్ర పరిమితం చేయడంతో వైసీపీ ఎమ్మెల్యేల గొంతులో పచ్చి వెలక్కాయ పడిందని టాక్. అవినీతికి ఆస్కారం లేకుండా వాలంటీర్ల సాయంతో నిజమైన లబ్దిదారుల ఎంపిక జరుగుతుండటంతో తమకు పని లేకుండా పోయిందని అనుచరుల దగ్గర చెప్పుకుని ఎమ్మెల్యేలు వాపోతున్నారట. అంతా అధికారుల కనుసన్నల్లోనే సంక్షేమ పథకాల కేటాయింపులు జరగడం, డిజిటల్ పద్ధతిలోనే లబ్దిదారుల ఎంపిక నిర్వహిస్తుండటంతో తామంతా డమ్మీలం అయినట్లు శాసనసభ్యులు మధనపడుతున్నారట. 

సామాన్య ప్రజలు, పార్టీ కార్యకర్తలు వచ్చి తమకు పింఛన్ లు ఇప్పించాలని ఇంకో పథకంలో లబ్ధి చేకూర్చాలని కోరినా చేయలేకపోతున్నారట. పనేదైనా ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండా గ్రామ సచివాలయం, జిల్లా కలెక్టర్ స్థాయిలోనే పరిష్కారమవుతుండడంతో జనాలు కార్యాలయాల చుట్టూనే తిరుగుతున్నారట. గతంలో అధికారుల బదిలీలు. పోస్టింగ్ ల విషయంలో ఎమ్మెల్యే సిపార్సు లేఖలకు డిమాండ్ ఉండేది. ఎమ్మెల్యేలు కూడా తమకు నచ్చిన అధికారిని నియోజకవర్గానికి తెచ్చుకునేవారు. ప్రస్తుతం అమరావతి పరిధిలోనే ట్రాన్సఫర్స్ జరుగుతున్నాయని, మరికొన్ని మంత్రుల కనుసన్నల్లో జరిగిపోతున్నాయని అంటున్నారు. దీంతో సొంత పనులు సైతం ఎవరినో ఒకరిని అడుక్కునే పరిస్థితి నెలకొందని కుమిలిపోతున్నారట అధికార పార్టీ ఎమ్మెల్యేలు. పరిస్థితి ఇలానే ఉంటే వచ్చే ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగగలమని తమలో తామే ప్రశ్నించుకుంటున్నారట శాసన సభ్యులు.