రాజధానిగా అమరావతినే కొనసాగించాలనేది నా కోరిక: వైసీపీ ఎమ్మెల్యే

ఏపీలో రాజధాని రగడ రోజురోజుకి ఉదృతమవుతున్న సంగతి తెలిసిందే. అమరావతి నుంచి రాజధానిని తరలించవద్దని, మూడు రాజధానుల ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని.. రాజధాని ప్రాంత రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. విపక్ష పార్టీలు వారి ఆందోళనకు మద్దతుగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష టీడీపీ అమరావతి కోసం గట్టిగా పోరాడుతోంది. మరోవైపు అధికార పార్టీ వైసీపీ మాత్రం.. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని, అందుకే టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులతో ఆందోళనలు చేయిస్తుందని ఆరోపిస్తోంది. మొత్తానికి ఇలా ఆరోపణలు, ఆందోళనల మధ్య రాజధాని రగడ ఉధృతమవుతోంది. ఇదిలా ఉంటే దాదాపు వైసీపీ నేతలంతా మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. అయితే ఒక వైసీపీ ఎమ్మెల్యే మాత్రం.. రాజధానిగా అమరావతి ఉంటే బాగుంటుందని అంటున్నారు. అలా అని సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకించరట. ఇంతకీ ఆ నేత ఎవరో కాదు.. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌

తాజాగా నియోజకవర్గంలో ఆయన పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నియోజక వర్గ సమగ్రాభివృద్ధికి కట్టుబడి పని చేస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రాంత వాసిగా అమరావతినే రాజధానిగా కొనసాగించాలనేదే నాకోరికా అన్నారు. అయితే పార్టీ అధినేత జగన్‌ నిర్ణయమే నాకు శిరోధార్యమన్నారు. కాగా వసంత వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయన తీరు కర్ర విరక్కూడదు, పాము చావకూడదు అన్నట్టుగా ఉందని అమరావతి ప్రాంత రైతులు మండిపడుతున్నారు. ఎన్నికలకు ముందు రాజధానిగా అమరావతే కొనసాగుతుందని చెప్పి.. తీరా ఎన్నికల్లో గెలిచాక ఇప్పుడేమో పార్టీ అధినేత జగన్‌ నిర్ణయమే నాకు శిరోధార్యమనడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలనేదే నాకోరిక అంటూ.. మళ్లీ జగన్ నిర్ణయానికి జై కొట్టడం ఏంటని వసంత తీరుని రైతులు తప్పుబడుతున్నారు. ఆయన స్వలాభం కోసం రెండు మాటలు చెప్పకుండా.. అమరావతి ప్రాంత రైతులకు అన్యాయం జరగకుండా పోరాడాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.