రమ్మనప్పుడు రావాలి.. పార్టీ మారని టిడిపి ఎమ్మెల్యేల వ్యాపారాలపై దాడులు

 

ప్రకాశం జిల్లా, అద్దంకి టిడిపి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ ని అధికార పార్టీ టార్గెట్ చేసిందని జిల్లా వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2004 నుంచి వరుసగా నాలుగు సార్లు గొట్టిపాటి రవి కుమార్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 లో వైసీపీ నుంచి గెలుపొందిన రవికుమార్ అప్పటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో టిడిపిలో చేరారు. 2019 ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేసి తిరిగి అద్దంకి ఎమ్మెల్యేగా గెలుపొందారు.వైసీపీ నేతలతో సన్నిహిత సంబంధాలున్న గొట్టిపాటి రవికుమార్ ని టీడీపీకి దూరం చేసేందుకు వైసీపీ నేతలు ప్లాన్ చేస్తున్నారట. టీడీపీకి రాజీనామా చేయాలని గత నెల రోజుల నుంచి రవి కుమార్ పై ఒత్తిడి తెస్తున్నట్టు ఆయన సన్నిహితులు చెప్పుకొస్తున్నారు. కాకపోతే రాజీనామా చేసి వస్తే అధికార పార్టీలో ఇచ్చే పదవిపై మాత్రం స్పష్టత ఇవ్వడం లేదట. దీంతో రవికుమార్ వైసీపీలో ఉన్న తన సన్నిహితులతో చర్చలు జరుపుతున్నారు. పార్టీకే కాదు ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేస్తా కానీ అద్దంకి నియోజకవర్గ ఇంచార్జి పదవి మాత్రం తనకే ఇవ్వాలని గొట్టిపాటి రవికుమార్ కండీషన్ పెట్టినట్టు వైసీపి వర్గాల టాక్. ప్రస్తుతం చెప్పింది చేయడమే తప్ప కండిషన్ లు పట్టడం కుదరదని  వైసిపి ముఖ్య నేతలు చెప్పారట.

దాంతో టీడీపీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవి వదులుకుంటే తన పొలిటికల్ ఫ్యూచర్ ఏంటో రవికుమారి అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. మరోవైపు రవికుమారి పై అధికార పార్టీ విజిలెన్స్ దాడులు మొదలు పెట్టేసింది. గొట్టిపాటి రవికుమార్ కి అద్దంకి నియోజక వర్గంలోని బల్లికురవ మండలం లో గ్రానైట్ క్వారీ లు ఉన్నాయి వీటి పై గత కొద్ది రోజులుగా వరుస దాడులు జరుగుతున్నాయి. బల్లికురవలో వంద గ్రానైట్ క్వారీల ఉన్నా కేవలం రవికుమార్ గ్రానైట్ క్వారీల పై మాత్రమే విజిలెన్స్ అధికారుల దాడులు చేస్తున్నారు. క్వారీ రికార్డులూ ఇప్పటి వరకూ వెలికితీసిన గ్రానైట్ రాళ్ల వివరాలూ అడుగుతూ సతాయిస్తున్నారు.దీంతో పాటు పెనాల్టీ లు వేస్తే వంద కోట్లు దాటుతున్నట్టు బెంబేలెత్తిపోతున్నారు. దీంతో గొట్టిపాటి రవి కుమార్ పొలిటికల్ ఫ్యూచర్ పై సతమతమై పోతున్నారు. అధికార పార్టీ వైపు నుంచి వస్తున్న ఒత్తిడితో గొట్టిపాటి రవికుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.