నాడు ఇసుక దోపిడీ... నేడు దీక్షలు

 

టిడిపి హయాంలో ఐదేళ్ళపాటు ఏపీలో ఇసుక దందా నడిచింది. డ్వాక్రా సంఘాల ముసుగులో పచ్చ పార్టీ నేతలే అడ్డగోలుగా ఇసుక తవ్వి వేల కోట్లు దోచుకున్నారు. చంద్రబాబు నివాసం పక్కనే జరిగిన అడ్డగోలు తవ్వకాలపై ఎన్జీటీ వంద కోట్ల జరిమానా వేసిన పరిస్థితి, అలాంటి చంద్రబాబు ఇప్పుడు ఇసుక కొరత తీరుతున్న సమయంలో దీక్షల పేరుతో డ్రామాలు చేయటంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఐదేళ్ళు ఇసుక మాఫియాను ప్రోత్సహించిన చంద్రబాబు ఇప్పుడు దొంగ దీక్షలు చేస్తున్నారని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. బాబు కొంగజపాలు అందరికీ తెలుసన్నారు, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజారంజక పాలన చూసి ఓర్వలేకే చంద్రబాబు, లోకేష్ లు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 

చంద్రబాబు తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించాలని లేకుంటే చంద్రబాబు దీక్ష పక్కనే తాను కూడా దీక్షకు దిగుతానని వైఎస్సార్ సిపి ఎమ్మెల్యే పార్థసారథి హెచ్చరించారు. టిడిపి విడుదల చేసిన చార్జిషీట్ అబద్దాల పుట్ట అని ఆరోపించారు. బీసీ నేతలను టార్గెట్ చేస్తూ చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని పార్థసారథి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 

ఇసుకను చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. రాష్ట్రంలో ఇసుక కొరత సమస్య తీరిందన్న ఆయన.. చంద్రబాబు ఎందుకోసం దీక్ష చేస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు చేసేవి దొంగ దీక్షలు కొంగ జపాలనీ మల్లాది విష్ణు ఆరోపించారు. తనపై చంద్రబాబు చేసిన ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్. చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఇసుక సరఫరా ప్రారంభమయ్యే సమయానికి దీక్షలంటూ డ్రామాలు చేస్తూ క్రెడిట్ సంపాదించాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. ఐదేళ్ల పాటు తాను వెనకుండి టిడిపి నేతలతో ఇసుక మాఫియాను నడిపించిన చంద్రబాబు ఇప్పుడు అదే ఇసుకపై దీక్షకు దిగారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.