సీఎం పోలవరం పర్యటనలో రచ్చ.. పోలీసులు వర్సెస్ వైసీపీ నేతలు!!

ఏపీ సీఎం వైఎస్ జగన్ పోలవరం ప్రాజెక్టు పర్యటనలో భాగంగా.. ప్రాజెక్ట్ ప్రాంతంలో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. సీఎం హోదాలో జగన్ పోలవరానికి వెళ్లడం ఇది రెండోసారి. పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే వద్ద ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించిన జగన్.. పోలవరం పురోగతి పనులను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. 

ఇదిలా ఉంటే.. పోలవరం ప్రాజెక్టు హెలిపాడ్ వద్ద పోలీసులకు- వైసీపీ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. సీఎం జగన్ దగ్గరకు వెళ్ళనివ్వకుండా పోలీసులు అడ్డుకోవడంతో కొందరు వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారట. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ వాగ్వాదానికి దిగినట్టు తెలుస్తోంది. అయితే అక్కడే ఉన్న మరికొందరు నేతలు రంగంలోకి దిగి సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగిందని సమాచారం. కాగా.. ఇటీవలే జగన్ కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి- సీఎం సిబ్బంది మధ్య జరిగిన వాగ్వాదం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ వివాదం మరువక ముందే తాజాగా మరోసారి ఇలాంటి ఘటన జరగడం చర్చనీయాంశమైంది.