చంద్రబాబుని ప్రజల్లోకి వెళ్లనివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం?

టీడీపీ అధినేత చంద్రబాబుని ప్రజలలోకి వెళ్లనివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారా? అంటే అవుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఎన్నడూ ఎదుర్కోనంత కఠిన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు ప్రస్తుతం. ఈ తొమ్మిది నెలల కాలంలో.. ప్రతిపక్ష నేతగా ప్రజల్లోకి వెళ్లడానికి ఆయనకు అడుగడుగునా అడ్డంకులు ఏర్పడ్డాయి. ఆయన ఏదైనా సమస్య మీద నిరసన తెలపాలి అనుకున్న ప్రతిసారి ఆయనను నిర్బంధిస్తున్నారు. ఈ తొమ్మిది నెలల కాలంలో ఆయనను నాలుగు సార్లు నిర్బంధించారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇసుక కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇసుక కొరతతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ సమయంలో ప్రతిపక్ష పార్టీ టీడీపీ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టింది. ఇసుక కొరతను ప్రభుత్వం కృత్రికంగా సృష్టించిందని, తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చంద్రబాబు నిరసన బాట పట్టగా.. ఆయనను పోలీసులు అరెస్ట్ చేస్తున్నట్లుగా ప్రకటించారు.

వైసీపీ అధికారంలోకి వచ్చాక గ్రామాలలో టీడీపీ కార్యకర్తలపై.. వైసీపీ శ్రేణులు దాడులు చేస్తున్నాయని అప్పుడు టీడీపీ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆ దాడుల్లో కొందరు టీడీపీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారని టీడీపీ చెప్పుకొచ్చింది. ఆ దాడులకు నిరసనగా చంద్రబాబు 'చలో ఆత్మకూరు'కు పిలుపునిచ్చారు. అయితే, చంద్రబాబును ఇంట్లో నుంచి బయటకు రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబు పర్యటనకు వెళ్తే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయన్న కారణంగా ఈ పర్యటనను అడ్డుకున్నట్టు పోలీసులు తెలిపారు.

ఇక కొద్ది రోజులుగా రాజధాని అంశం రాష్ట్రాన్ని ఓ కుదుపు కుదుపుతోన్న సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులకు తెరలేపడంతో.. అమరావతి ప్రాంత రైతులు, మహిళలు  ఉద్యమం బాట పట్టారు. ఆ ఉద్యమానికి టీడీపీ అండగా నిలిచింది. చంద్రబాబు కూడా వారి ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. అయితే, ఒకసారి అమరావతి జేఏసీ బస్సు యాత్రని ప్రారభించాల్సిన సమయంలో.. పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. దీనికి నిరసనగా చంద్రబాబు పాదయాత్రగా బస్సుల దగ్గరకు వెళ్లేందుకు సిద్ధమవడంతో.. ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. 

తాజాగా విశాఖ పర్యటన అయితే సరే సరి. జగన్ తొమ్మిది నెలల పాలనలో చేసిన తప్పులను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా చంద్రబాబు 'ప్రజా చైతన్య యాత్ర'కు శ్రీకారం చుట్టారు. దానిలో భాగంగా గురువారం చంద్రబాబు విశాఖకు వెళ్లగా ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొదట చంద్రబాబు కాన్వాయ్ ని అధికార పార్టీ కార్యకర్తలు అడ్డుకొని.. కాన్వాయ్ పైకి చెప్పులు, కోడిగుడ్లు విసిరారు. వారిని పోలీసులు నిరువరించలేక చంద్రబాబుని అదుపులోకి తీసుకొని వెనక్కి పంపారు. దీనిపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. అనుమతిచ్చి ఇలా అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. పోలీసుల తీరుపై హైకోర్టు కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆందోళన కారుల్ని అడ్డుకోవాల్సింది పోయి, ఇలా అనుమతిచ్చి మరీ ప్రతిపక్ష నేతని అదుపులోకి తీసుకోవడం ఏంటని ప్రశ్నించింది. మొత్తానికి ఇదంతా చూస్తుంటే.. తమ నేతని కావాలనే ప్రజల్లోకి వెళ్లనివ్వకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.