జగన్ స్పీడ్ ను అందుకోలేకపోతున్న కేసీఆర్, బాబు... టీఆర్ఎస్ లీడర్ల వెరైటీ సెంటిమెంట్

 

కేసీఆర్, చంద్రబాబుతో పోల్చితే జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు అత్యంత వేగంగా ఉంటున్నాయి. పదవుల పంపకం దగ్గర్నుంచి పథకాల అమలు వరకు అన్నింటిలోనూ దూకుడే కనిపిస్తుంది. ఒకరికిస్తే మిగతా వాళ్లు అసమ్మతి గళం విప్పుతారేమోనన్న భయాన్ని పక్కనబెట్టి తనను నమ్ముకున్నవాళ్లకు ఏదోఒక పదవితో కట్టబెడుతున్నారు. అధికారంలోకి వచ్చిన ఆర్నెళ్లలోనే అనేక నామినేటెడ్ పదవులను భర్తీ చేశారు. చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో నామినేటెడ్ పదవుల భర్తీకి ఆపసోపాలు పడ్డారు. చివరి ఏడాదిన్నరలో ఏదో తూతూమంత్రంగా కొందరికి నామినేటెడ్ పదవులు కట్టబెట్టారు.

ఇక, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే... దాదాపు ఆరేళ్లుగా ఇటు నామినేటెడ్... అటు పార్టీ పదవులను భర్తీ చేయడంలో ఇబ్బందులు పడుతున్నారు. ఒకేసారి నామినేటెడ్ అండ్ పార్టీ పదవులను భర్తీ చేస్తే... ఎక్కడ చిక్కులు వస్తాయోనన్న భయంతో అప్పడప్పుడూ ఒక్కో పదవిని మాత్రమే కట్టబెడుతున్నారు. దాంతో, తెలంగాణలో ఇంకా ఎన్నో నామినేటెడ్ పదవులు భర్తీ కాకుండానే మిగిలిపోతున్నాయి. అయితే, ఆరేళ్లుగా పూర్తిస్థాయిలో నామినేటెడ్ పదవులు భర్తీకాగా ద్వితీయ శ్రేణి టీఆర్ఎస్ నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు.

అయితే, నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్న ఎంతోమంది టీఆర్ఎస్ నేతలు... ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి విజ్ఞప్తి చేసుకుందామంటే అసలు అపాయింట్ మెంటే దొరకడం లేదు. దాంతో, ఏదోరకంగా కేసీఆర్ ను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ముఖ్యమంత్రిని కలవాలంటే ఒకే ఒక మార్గం పనవుతుందట. ఇంట్లో శుభకార్యం ఉందని, కేసీఆర్ ను ఆహ్వానించేందుకు, అపాయింట్ మెంట్ కోరుతుంటే మాత్రం సీఎం దర్శనభాగ్యం దక్కుతోందట. అపాయింట్ మెంట్ దక్కడమే కాదు... తమ మనసులోని మాటను కేసీఆర్ ముందు పెడుతుండటంతో ఫలితం కనిపిస్తోందట. శాట్స్ మాజీ ఛైర్మన్ వెంకటేశ్వరరెడ్డి పదవి రెన్యువల్... అలాగే, పల్లా రాజేశ్వరరెడ్డికి రైతు సమన్వయ సమితి ఛైర్మన్ పోస్ట్ అలాగే దక్కాయట. పల్లా కుమారుడి పెళ్లికి హాజరైన కేసీఆర్... ఆ తీపికబురును అక్కడే చెప్పి ఖుషీ చేశారట. అలాగే, శాట్స్ మాజీ ఛైర్మన్ వెంకటేశ్వరరెడ్డి ఇంట్లో ఫంక్షన్ కు వచ్చి... పదవి రెన్యువల్ వార్తను చెప్పారట. దాంతో, తమ ఇంట్లో కూడా త్వరగా ఏదైనా శుభకార్యం జరిగితే బాగుండ్ను... తమకి కూడా ఏదో ఒక పదవి దక్కుతుందేమోనని పలువురు టీఆర్ఎస్ నేతలు అనుకుంటున్నారట. మరి, ఇది అందరికీ వర్కటవుతుందో లేదో తెలియదు గానీ, గులాబీ నేతలు మాత్రం తమ ఇళ్లల్లో ఏదో శుభకార్యం జరగాలని మాత్రం కోరుకుంటున్నారట.