టార్గెట్ ప్రకాశం.. ఓడిన 4 స్థానాల్లో పట్టుకోసం అడుగులు వేస్తున్న వైసీపీ

 

వైసీపీ ఏర్పాటైనప్పటి నుంచి ప్రకాశం జిల్లా ఆ పార్టీకి కంచుకోట గానే ఉంది. జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో తిరుగులేని ఆధిపత్యాన్ని పార్టీ కనబరుస్తూనే ఉంది. కానీ ప్రస్తుతం టిడిపి సొంతం చేసుకున్న కొండేపి, అద్దంకి, పర్చూరు, చీరాల ప్రాంతాలు మాత్రం ఆ పార్టీని కలవరపెడుతున్నాయి. 2014 ఎన్నికల్లో సైతం ఈ ప్రాంతాల పై పట్టు సాధించాలని ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది. 2019 ఎన్నికల్లో జగన్ గాలి తుఫానులా వీచినా కూడా జిల్లాలో టిడిపి ఆ 4 స్థానాలను గెలుచుకుంది. దీంతో ఆ నియోజక వర్గాల్లో బలాన్ని పెంచుకోవాలని అధినేత జగన్ సూచించారు. ఈ నేపథ్యంలో జగన్ బాబాయి.. వైవీ సుబ్బారెడ్డితో జిల్లా పరిశీలకుడు సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశమవడం చర్చనీయాంశమైంది. ఓటమి పాలైన నియోజకవర్గాల పై ఓ వైపు దృష్టిసారిస్తూనే మరోవైపు జిల్లాలోని నియోజక వర్గాల్లో వైసీపీ గెలిచిన ప్రాంతాల్లో పార్టీ స్థితిగతులు నాయకుల పాలనపై అంచనా వేస్తున్నారు. వైసీపీ వర్గాల నుంచి సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డారు. ఆ నివేదికను జగన్ కు ఎప్పటికప్పుడు అందించి పార్టీ పై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని పోకుండా ఉండేలా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారని జనాలంటున్నారు. ఓటమి చెందిన 4 ప్రాంతాల్లో నాయకత్వం పై దృష్టి సారించి అక్కడ లోపాలను తెలుసుకుని వచ్చే ఎన్నికల్లో మొత్తం క్లీన్ స్వీప్ చేసే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. 

మరోపక్క జమిలి ఎన్నికలు రావొచ్చనే ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో అప్రమత్తమైన టిడిపి ఇప్పటి నుండే మండల స్థాయి నుంచి నియోజక వర్గం జిల్లా నాయకత్వం వరకు సమీక్షలు నిర్వహించేలా అధినేత చంద్రబాబు పక్కా ప్లాన్ వేస్తున్నారు. అందుకే వైసీపీ కూడా ఈ 4 స్థానాలను కైవసం చేసుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ రచిస్తోంది అంటున్నారు. అమరావతిలో వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలు కలిసి జిల్లాలో పార్టీ పరిస్థితులు, నాయకుల పాలన, సమస్యలపై బాలినేనితో సుదీర్ఘంగా చర్చించినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. పర్చూరులో రావి రామనాథం నాయకత్వం పై అనుమానాలు వ్యక్తం చేయగా ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దామని డిసైడ్ చేశారు. అవసరమైతే ఎన్నికలకు ఏడాది ముందు పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవచ్చని అభిప్రాయానికి వచ్చారు. అద్దంకి, కొండపి నియోజక వర్గాల్లోనే నాయకత్వం పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అక్కడ పూర్తి స్థాయిలో దృష్టి సారించి అవసరమైతే తమ రిమోట్ లోకి తీసుకుని అయినా సరే పార్టీని పటిష్టం చేసేలా చర్యలు తీసుకోవాలని బాలినేనికి సూచించారు. చీరాలలో రోజుకొక వివాదం అక్కడ పార్టీ పరిస్థితులు నాయకుల చేరికల పై ఆరా తీసినట్టు సమాచారం. పరుచూరులో ఎదురైన పరిస్థితులను చివరి వరకూ తెలుసుకోలేకపోవడం పై డిస్కస్ చేసుకున్నారు. మొత్తం మీద ఇప్పటి నుంచి ఆ నియోజక వర్గాల్లో పట్టు సాధించటానికి పనులు మొదలుపెట్టేశారని అంటున్నారు వైసీపీ కార్యకర్తలు.