ప్ర‌జాస్వామ్య‌మా? దొంగ‌స్వామ్య‌మా?

నీ పేరేంటి? అటునుంచి మౌనం. మీ ఊరేంటి? మ‌ళ్లీ సైలెన్స్‌. మీ ఇంటి అడ్ర‌స్ చెప్పు? తెలీదు. ఇక్క‌డికి ఎందుకొచ్చారు? దేవుడి ద‌ర్శ‌నానికి. ఇక్క‌డేం ప‌ని? హాస్పిట‌ల్‌కు వ‌చ్చా. ఇవ‌న్నీ తిరుప‌తి ఎంపీ ఉప ఎన్నిక‌ల్లో దొంగ ఓట‌ర్ల డ్రామాలు. పోలింగ్ బూతు ముందు క్యూ లైన్ల‌లో ద‌ర్జాగా నిలుచున్నారు. దాదాపు అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ చాంతాడంత క్యూలు. అంద‌రి చేతిలో ఓట‌ర్ ఐడీ కార్డులు ఉన్నాయి. కానీ, వారెవ‌రో అక్క‌డి పోలింగ్ ఏజెంట్ల‌కు తెలీదు. ఇదేంటీ ఇంత‌మంది ఉన్నారేంటి?  వీరెవ‌రూ ఇక్క‌డి వారిలా క‌నిపించ‌డంలేదే. ఇన్నేళ్ల‌లో వీళ్ల‌ను ఎప్పుడూ చూడ‌లేదే? ఇదీ స్థానికుల‌కు వ‌చ్చిన అనుమానం. అదే అనుమానంతో క్యూ లైన్ల‌లో ఉన్న ఓట‌ర్ల‌ను ప్ర‌శ్నించారు. మీ పేరేంటి? ఏ ఏరియా? ఇంటి నెంబ‌ర్ చెప్పు? ఇలా ఏ ప్ర‌శ్న‌కూ ఆ ఓట‌ర్ల ద‌గ్గ‌ర స‌మాధానం లేదు. ఎందుకంటే వారెవ‌రూ అక్క‌డి వారు కాదు కాబ‌ట్టి. వారంతా దొంగ ఓట‌ర్లు. అధికార వైసీపీకి ఓటేసేందుకు ప‌క్క జిల్లాల నుంచి త‌ర‌లించారు. 

ఏ ప‌ది మందో.. పాతిక మందో కాదు. తెల్ల‌వార‌క ముందే బ‌స్సుల‌కు బ‌స్సులు తిరుప‌తిలో దిగాయి. క‌డ‌ప జిల్లాకు చెందిన ఓ అధికార పార్టీ నేత ఈ బ‌స్సుల‌ను అరేంజ్ చేశాడ‌ట‌. మొత్తం 8 ప్రైవేట్ ట్రావెల్స్ బ‌స్సులు. మ‌రో 8 స్కూల్ వ్యానులు. బ‌స్సుల నిండా కిక్కిరిసిన జ‌నం. బ‌స్సుల‌ను ఏరియాల వారీగా పార్క్ చేశారు. క‌డ‌ప నుంచి తీసుకొచ్చిన జ‌నాన్ని ప్రాంతాల వారీగా పంపించారు. వాళ్లంతా దొంగ‌ ఓట్లు వేయ‌డంతో ఎక్స్‌ప‌ర్ట్స్ అట‌. తిరుప‌తిలో ఎలాగైనా గెల‌వాల‌ని, సాధ్య‌మైనంత మెజార్టీ పెంచుకోవాల‌ని ఇలా ప‌క్క జిల్లాల నుంచి దొంగ ఓట‌ర్ల‌ను డంప్ చేశారు వైసీపీ నాయ‌కులు. క‌డ‌ప‌కు చెందిన ఒక్క లీడ‌రే అన్ని బ‌స్సుల్లో జ‌నాల్ని త‌ర‌లిస్తే.. ఇక మిగ‌తా నాయ‌కులు ఎంత‌మందిని త‌ర‌లించి ఉంటారో?  దొరికిన వాళ్లే దొంగలు.. దొర‌క్కుండా దొంగ‌చాటుగా ఓటేసిన కేటుగాళ్లు ఇంకెంద‌రో. పోలీసుల లెక్క ప్ర‌కార‌మే 250కి పైగా బ‌స్సుల‌ను తిరుప‌తి రాకుండా వెన‌క్కి పంపించారంటే ఏ రేంజ్‌లో దొంగ ఓట్ల‌కు అధికార పార్టీ ప్లాన్ చేసిందో అర్థం చేసుకోవ‌చ్చు.

వెంక‌న్న భ‌క్తుల ముసుగులో కొంద‌రు.. ఆసుప‌త్రిలో చూపించుకోవాలంటూ రోగులమంటూ మ‌రికొంద‌రు.. చుట్టాలింటికొచ్చామ‌ని ఇంకొంద‌రు‌.. ప‌క్కా ట్రైనింగ్‌తో వ‌చ్చిన‌ట్టున్నారు దొంగ ఓట‌ర్లు. కాస్త లేటైనా.. ఎట్ట‌కేల‌‌కు టీడీపీ శ్రేణులు దొంగ ఓట‌ర్ల‌ను గుర్తించి ఎక్క‌డిక‌క్క‌డ వారిని అడ్డుకున్నారు. దీంతో అధికార పార్టీ గుడుపుఠాని మీడియా ముందుకు వ‌చ్చింది. ఈ విష‌యం తెలిసినా, మీడియా సాక్షిగా దొంగ ఓట‌ర్లు దొరికిపోయినా.. పోలీసులు ప‌ట్టించుకోక‌పోవ‌డం క‌ల‌క‌లం రేపింది. ఎన్నిక‌ల సిబ్బంది ఉదాసీన‌త‌తోనే ఇంత భారీ స్థాయిలో దొంగ ఓటింగ్ జ‌రుగుతోంద‌ని టీడీపీ శ్రేణులు ధ‌ర్నాలు, నిర‌స‌న‌ల‌కు దిగారు. అయినా, అధికారుల్లో స్పంద‌న లేక‌పోయింది. పోలీసులు ప‌ట్టించుకోవ‌డం లేదు. పైగా, దొంగ ఓట‌ర్ల‌ను ప‌ట్టుకున్న తెలుగుదేశం నాయ‌కుల‌పైనే కేసులు పెట్ట‌డం విచిత్రం.

పోలింగ్ జ‌రుగుతున్న చోట ఆ ప్రాంతం కాని వారు అక్క‌డ ఉండ‌టం నిషిద్ధం. ఈ రూల్ అంద‌రికీ తెలుసు. తెలిసి కూడా మంత్రి పెద్దిరెడ్డితో స‌హా ప‌లువురు వైసీపీ ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నాయ‌కులు పోలింగ్ జ‌రుగుతున్న ఏరియాల్లో మ‌కాం వేసి ఓటింగ్ స‌ర‌ళిని మేనేజ్ చేస్తున్నారని అంటున్నారు. తిరుప‌తిలో ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్ర‌బాబు, జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్‌లు ఆరోపిస్తున్నా ప్ర‌యోజ‌నం లేకుండాపోయింది. అధికారులు, పోలీసుల సాయంతో.. అధికార పార్టీ క‌నుస‌న్న‌ల్లో.. తిరుప‌తిలో ప్ర‌జాస్వామ్యం ప‌రిహాస్యం జ‌రుగుతోందని టీడీపీ మండిప‌డుతోంది. తిరుప‌తి ఉప ఎన్నిక‌లో 6 ల‌క్ష‌ల మెజార్టీ సాధిస్తామంటూ అధికారు పార్టీ ప్ర‌గల్బాలు ప‌లుకుతుంటే ఏమో అనుకున్నాం.. ఇలా దొంగ ఓట్ల‌తోనా? అని ప్ర‌తిప‌క్షాలు క‌న్నెర్ర చేస్తున్నాయి.‌