జూపూడి ప్రభాకర్ పై వైసీపీ క్యాడర్ ఆగ్రహం...

 

ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ జూపూడి ప్రభాకర్ పై వైసీపీ క్యాడర్ తెగ మండిపడుతోంది. పార్టీ ఓటమిపాలైనప్పుడు టిడిపి లో చేరి ఇప్పుడు అధికారంలోకి రాగానే తిరిగి వైసీపీ లో చేరారని ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీలో క్యాడర్ తో పాటు కొంత మంది నాయకులు కూడా జూపూడిపై ఫైర్ అవుతున్నారట, ఎన్నికల ఫలితాల ముందు వరకూ తెలుగు దేశం పార్టీలో జూపూడి ప్రభాకర్ ముఖ్య నేతగా పని చేశారు. 

అయితే 2014 ఎన్నికల ఫలితాల ముందు వరకూ ఆయన వైసీపీలో కీలకంగా వ్యవహరించారు. 2014 ఎన్నికల సమయంలో ప్రకాశం జిల్లా కొండపి నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి జూపూడి ప్రభాకర్ ఓటమిపాలయ్యారు. ఆ ఎన్నికల్లో వైసిపి పరాజయం పాలవడంతో పెద్దగా టైం తీసుకోకుండా జూపూడి ప్రభాకర్ టిడిపిలోకి జంపైపోయారు. ఎమ్మెల్సీ పదవి గుమ్మం ముందు వరకూ వచ్చినా సాంకేతిక కారణాలు అడ్డం పడ్డాయి, ఆ వెంటనే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి జూపూడి ప్రభాకర్ ని వరించింది. దీంతో తెలుగు దేశం పార్టీలో ఆయన కీలకంగా వ్యవహరించారు.

పార్టీ కార్యక్రమాల్లో ప్రెస్ మీట్లలో ఆయన ప్రభావం స్పష్టంగా కనిపించేది. వైసిపిలో ఉన్నప్పుడు జగన్ కి సన్నిహితంగా వ్యవహరించిన జూపూడి ప్రభాకర్.. టీడీపీలో చేరాక ఆయనపైనే విమర్శలు, సెటైర్ లు కూడా వేశారు. 2019 ఎన్నికల్లో తిరిగి పోటీ చేయాలని జూపూడి భావించారు. గతంలో ఓటమి పాలయిన కొండపి నుండి మరోసారి పోటీ చేసేందుకు ఆయన ప్రయత్నించారు. టిడిపి టికెట్ దక్కించుకునేందుకు ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే స్వామితో పోటీ పడ్డారు. కానీ, చివరి నిమిషంలో పార్టీ టికెట్ స్వామికే దక్కింది. దీంతో నామినేటెడ్ పదవిపై ఆశతో ఎన్నికల బరి నుండి తప్పుకున్న జూపూడికి టిడిపి ఓటమి జీర్ణించుకోలేని అంశంగా మారింది. ఆ క్రమంలో సొంత గూటికి చేరుకునేందుకు జూపూడి వైసీపీ నేతలతో చర్చలు జరిపి సక్సెస్ అయ్యారు.

అయితే వైసీపీ నుండి బయటకు వెళ్లిన సమయంలో జూపూడి ప్రభాకర్ చేసిన కామెంట్ లను వైసీపీ క్యాడర్ జీర్ణించుకోలేకపోతుందట.  జూపూడి ప్రభాకర్ టిడిపి లో ఉన్న సమయంలో చేసిన కామెంట్ లకు సంబంధించి తేదీలతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జూపూడి ప్రభాకర్ ని వైసిపి అధిష్టానం తిరిగి పార్టీలో చేర్చుకున్నా వైసీపీ క్యాడర్ మాత్రం తాము క్షమించబోమని పోస్టులు పెడుతోంది. జూపూడి ప్రభాకర్ తప్పి పోయిన గొర్రెపిల్లలా పక్కదారి పట్టామని బహిరంగంగా చెప్పినా వైసీపీ క్యాడర్ మాత్రం జూపూడిపై విమర్శలు గుప్పిస్తూనే ఉంది. సొంత గూటికి చేరుకున్న జూపూడిపై వైసీపీ క్యాడర్ ఆగ్రహం ఎప్పటికి చల్లారుతుందో చూడాలి.