లెజెండ్ ఎంటర్ అయితే..మరి అంతే సంగతులట!

 

బాలకృష్ణ ఈసారి ఎన్నికలలో పోటీ చేస్తున్నందున ఆయన నటించిన ‘లెజెండ్’ సినిమా ప్రదర్శనను నిలిపివేయమని కోరుతూ వైకాపా రాష్ట్ర ఎన్నికల కమీషన్ కు నిన్న ఒక వినతి పత్రం అందజేసింది. ఎన్నికల జరుగుతున్న ఈ తరుణంలో ఆ సినిమా ప్రభావం ఆయన పోటీ చేస్తున్న హిందూపురం ఓటర్లను ప్రభావితం చేయవచ్చని, అదేవిధంగా రాష్ట్రంలో ఓటర్లను తెలుగుదేశంకు పార్టీకి అనుకూలంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది గనుక తక్షణమే ‘లెజెండ్’ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని కోరింది.

 

లెజెండ్ సినిమా తెదేపాకు అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని వాదిస్తున్న వైకాపా, ఇంత కాలంగా బాలకృష్ణ ఎన్నికలలో పోటీ చేస్తారో లేదో తెలియకనే ఎటువంటి అభ్యంతరమూ వ్యక్తం చేయలేదు. కానీ, అప్పుడు లేని అభ్యంతరము ఇప్పుడు ఎందుకంటే నిజంగానే ‘లెజెండ్’ ఓటర్లందరి మీద కాకపోయినా, వైకాపా వైపున్న ఆయన అభిమానులపైనా ఎంతో కొంత ప్రభావం చూపుతుందనే భయమే కారణమనుకావచ్చును.

 

వర్తమాన రాజకీయాలపై సినిమాలు తీయడం కొత్తేమీ కాకపోయినా, సరిగ్గా ఎన్నికల సమయంలోనే లెజెండ్ విడుదలవడం కాకతాళీయం మాత్రం కాదు. అయితే రాజకీయ చైతన్యవంతులయిన ప్రజలు ఇటువంటి సినిమాలను చూసి తమ అభిప్రాయాలను మార్చుకోనేంత బలహీన మనస్కులు కారని వైకాపా, తెదేపాలు రెండూ గ్రహించవలసి ఉంది. ప్రజలు కేవలం వినోదం కోసమే సినిమాలు చూస్తారు తప్ప వాటి నుండి ఏదో ప్రేరణ ఆశించి మాత్రం కాదని ఈ రాజకీయనేతలు ఎప్పుడు గ్రహిస్తారో పాపం!