గన్నవరం ఉపఎన్నికలు... టిక్కెట్ యార్లగడ్డ కా లేక వంశీ కా?

 

గన్నవరం రాజకీయాలు గరంగరంగా మారుతూ రోజుకో మలుపు తిరుగుతున్నాయి. టిడిపికి రాజీనామా చేసిన వంశీ జగన్ వెంట నడుస్తానని ప్రకటించారు. త్వరలోనే వైసీపీలో చేరతారని చెప్పారు. అయితే పక్కా డేట్ మాత్రం ప్రకటించలేదు. సీఎం నిర్ణయం మేరకు తన చేరిక ఉంటుందని తెలిపారు వంశీ.  

వైసిపిలో చేరేందుకు వంశీ రెడీ అవుతున్నారనే సిగ్నల్స్ వస్తున్న సమయంలో  వైసీపీ సీనియర్ నేత దుట్టా రామచంద్రరావుతో వంశీ భేటీ కావడం హాట్ టాపిక్ గా మారింది. వంశీ, వైసీపీలో చేరడానికి ముహుర్తం ఖరారు అయిందని అందులో భాగంగానే వైసిపి నేతలను కలుస్తున్నారని చర్చ నడుస్తోంది. భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా వారితో కలిసి పని చేసేందుకు ముందు గానే వారితో భేటీ అవుతున్నారని అనుచరులు అంటున్నారు. 

మరోవైపు వైసిపి గన్నవరం ఇన్ చార్జ్ యార్లగడ్డ వెంకట్రావు.. జిల్లా మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలతో కలిసి సీఎం జగన్ తో భేటీ అయ్యారు. వంశీని పార్టీలోకి చేర్చుకోవడం పై చర్చ జరిగినట్లు తెలుస్తుంది. నియోజకవర్గంలో పార్టీ కోసం కష్టపడ్డానని వైసిపి కార్యకర్తలపై కేసులు పెట్టి వేధించారని ఆయన జగన్ వద్ద ప్రస్తావించారు. వంశీ వైసిపిలో చేరినా.. నీ రాజకీయ భవిష్యత్తు నేను చూసుకుంటానని జగన్ యార్లగడ్డకు భరోసా ఇచ్చారని తెలిపారు. వంశీ పార్టీలోకి వచ్చే విషయం తనకు తెలియదని.. జగన్ నాయకత్వంలోనే పని చేస్తానని.. వైసీపీలోనే ఉంటానని యార్లగడ్డ ప్రకటించారు. 

వంశీ పార్టీలోకి వస్తే యార్లగడ్డ, వంశీ ఇద్దరూ కలిసి పని చేస్తారా? కేడర్ కలిసిపోతుందా?? అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే ఎమ్మెల్యే టికెట్ హామీ జగన్ ఎవరికి ఇవ్వనున్నారు అనే ప్రశ్న కార్యకర్తలను సతమతం చేస్తుంది. ఒకరికి ఎమ్మెల్యే టికెట్ మరొకరికి ఎమ్మెల్సీ ఇస్తారనే విధంగా ఒప్పందం కుదిరిందనే ప్రచారం జరుగుతుంది. వంశీ పార్టీలోకి వచ్చిన తర్వాత స్పందిస్తానని యార్లగడ్డ అంటున్నారు. వంశీ అధికారికంగా వైసీపీ కండువా కప్పుకుంటే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే ఆసక్తికర చర్చ సాగుతోంది.