అదంతా తప్పుడు ప్రచారమే.. టీడీపీపై బురద జల్లుతున్నారు

ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా ఐటీ రైడ్స్ చాలా తీవ్రంగా సాగుతున్నాయి. అయితే ఈ ఐటీ రైడ్స్ లో చంద్రబాబు మాజీ పీఏ శ్రీనివాస్ ఇంట్లో రెండు వేల కోట్లు దొరికినట్టు వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు టీడీపీ నేత బోండా ఉమ. శ్రీనివాస్ ఇంట్లో 70 నుంచి 80 వేలు మాత్రమే పట్టుబడ్డాయని ఆయన అన్నారు. అదేవిధంగా వేరు వేరు చోట్ల జరిగిన ఐటీ తనిఖీల్లో టీడీపీకి సంబంధం లేదని కూడా ఆయన తెలిపారు. అవినీతి మరకను టీడీపీకి అంటించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు బోండా ఉమ. 

మాజీ పీఎస్ శ్రీనివాస్ కు టిడిపితో సంబంధం ఏంటని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. అతను ఒక ప్రభుత్వ ఉద్యోగి మాత్రమేనని వివరించారు. పీఏలు, పీఎస్ లతో పార్టీకి సంబంధం ఏంటని ఆయన ప్రశ్నించారు. 40 ఏళ్ల చంద్రబాబు రాజకీయ చరిత్రలో 10,15 మంది పీఏలుగా పని చేశారని తెలిపారు. శ్రీనివాస్ పై దాడుల పేరుతో టీడీపీపై బురద జల్లుతున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణలోని ఇన్ ఫ్రా కంపెనీపై దాడిని పార్టీకీ అంటగట్టడం హేయమని యనమల అన్నారు. దాడులు జరిగిన ఇన్ ఫ్రా కంపెనీకే జగన్ కాంట్రాక్టులు ఇచ్చారని యనమల రామకృష్ణుడు ఆరోపించారు.