జగన్ దీక్ష భగ్నం

 

సమైఖ్యాంద్ర కోసం గత ఐదురోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. నిరాహార దీక్ష వల్ల బీపీ, షుగర్ లెవల్స్ స్థాయి పడిపోవడం, కీటోన్స్ కూడా తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. గురువారం అర్ధరాత్రి, కట్టుదిట్టమైన భద్రత మధ్య చంచల్‌గూడ జైలు నుంచి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. జగన్ పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా లేనప్పటికీ... దీక్షను కొనసాగిస్తే మాత్రం కష్టమని ఆయనకు వైద్యపరీక్షలు నిర్వహించిన డాక్టర్లు పోలీసులకు వివరించారు. దీక్ష విరమించాలని అధికారులు కోరినప్పటికీ జగన్ తిరస్కరించడంతో...ఉన్నతాధికారుల సూచన మేరకు జగన్‌ను అర్ధరాత్రి 11 గంటల తర్వాత ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. జగన్ తల్లి విజయలక్ష్మి, భార్య భారతి కూడా ఉస్మానియా ఆస్పత్రికి వచ్చారు.