అబ్బాయిల బలహీనతే వీళ్ళ టార్గెట్..

ఓ అమ్మాయి సరదాగా మాట్లాడగానే అబ్బాయిలు ఊహాలోకంలో విహరిస్తూ ఉంటారు. చాలా మంది నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది అని గొప్పగా చెప్పుకోటానికి, డేటింగ్ చేయటానికి అత్యుత్సహం చూపిస్తుంటారు. ఇలాంటి వారి బలహీనతనే ఆదాయంగా మార్చుకోవాలని డేటింగ్‌ వెబ్‌సైట్ల పేరుతో కోట్ల రూపాయలు కొల్లగొట్టారు పశ్చిమ బెంగాల్‌ కు చెందిన ముఠా.

 

 

కేవలం రెండేళ్ల వ్యవధిలోనే సుమారు 150 కోట్ల రూపాయలవరకు కొల్లగొట్టారంటే ఎవరైనా విస్తుపోవాల్సిందే. గూగుల్, వివిధ సైట్ల నుంచి అందమైన, ఆకర్షణీయమైన అమ్మాయిలు, సెక్సీ ఫొటోలను తీసి అమ్మాయిలను సరఫరా చేస్తామంటూ వరల్డ్‌డేటింగ్‌.కామ్‌, గెట్‌యూత్‌లేడీ.కామ్‌, మైలవ్‌18.ఇన్‌ వెబ్‌సైట్లలో అప్‌లోడ్‌ చేశారు. ఈ వెబ్‌సైట్లలోనే ఒక ఫామ్‌ ఉంటుంది. కస్టమర్లు తమ వివరాలను అందులో పొందుపరచాలి. అందులోనే ఎటువంటి అమ్మాయి కావాలో ఎంపిక చేసుకోవాలి. వెబ్‌సైట్లో వివరాలు నమోదు కాగానే వారికి ఓ ఫోన్‌ వస్తుంది. అవతలి నుంచి ఓ అమ్మాయి ఆకర్షించే మాటలతో కవ్విస్తుంది.వివరాలు నమోదు చేయాలాగానే ఫోన్ వస్తుంది. ఓ అమ్మాయి తన మాటలతో ఆకర్షించటం మొదలుపెడుతుంది, సరదాగా కబుర్లు చెప్తూ బుట్టలో వేసుకుంటుంది. మనం బోల్తా పడ్డామా అంతే అందినకాడికి రకరకాల సర్వీసుల పేరిట దోచేస్తారు.

అమ్మాయిల కోసం ఉవ్విళ్లూరుతున్న యువత తమ వద్దకు వచ్చే అమ్మాయిని ఊహించుకుంటూ ఊహల్లో విహరిస్తారు. ఎంతకీ అమ్మాయి రాకపోవడంతో అంతకుముందు తనతో మాట్లాడిన అమ్మాయికి ఫోన్‌ చేస్తారు. అది కాస్తా స్విచ్ఛాఫ్‌ చేసి ఉంటుంది. చివరకు ఎలాంటి ఎస్కార్టు సర్వీసు ఇవ్వకుండానే బిచాణా ఎత్తేస్తారు. ఏకంగా 400 మందితో  20 కాల్‌ సెంటర్లను ఏర్పాటు చేసారంటే వీరి చేతిలో మోసపోయిన వారెందరో?.... అమ్మాయిల మీద వ్యామోహంతో ఉన్న యువత ఒక్కొక్కరు పది నుంచి 20 లక్షల వరకూ సమర్పించుకున్నారు. భాగ్యనగరానికి చెందిన ఓ యువకుడు 15 లక్షల వరకు చెల్లించి మోసపోయానని గ్రహించి పోలీస్ లను ఆశ్రయించటంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. సీపీ సజ్జనార్‌ ఆదేశాల మేరకు డీసీపీ జానకీ షర్మిల, ఏసీపీ శ్రీనివాసకుమార్‌ పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌, ఎస్సై విజయ్‌వర్థన్‌ రంగంలోకి దిగారు. బాధితుడు ఇచ్చిన వెబ్‌సైట్‌, ఫోన్‌ నంబర్లు, బ్యాంకు ఖాతాల ఆధారంగా నిందితులు పశ్చిమ బెంగాల్‌కు చెందిన ముఠాగా గుర్తించారు.పశ్చిమ బెంగాల్లోని హౌరాకు చెందిన దేబాశిష్‌ ముఖర్జీ,కోల్‌కతాకు చెందిన ఫెయిజుల్‌ హక్‌, సందీప్‌ మిత్రా, హౌరాకు చెందిన అనితా డే, సిలిగురికి చెందిన నీతా శంకర్‌ ప్రధాన నిందితులు.వీరిలో సందీప్‌ మిత్రా, నీతా శంకర్‌ను అరెస్టు చేశారు. వారి నుంచి లాప్‌టాప్‌-1, మొబైల్‌ ఫోన్లు-50, ఫింగర్‌ ప్రింట్‌ అటెండెన్స్‌ మిషన్‌-2, అటెండెన్స్‌ రిజిస్టర్లు-3, కస్టమర్స్‌ స్ర్కిప్టులను స్వాధీనం చేసుకున్నారు.