ఆకతాయిల పనిపట్టే – 1090

 

2012లో ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మహిళలలో ఓ సమావేశం నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఓ అమ్మాయి తాము ఎదుర్కొంటున్న వేధింపుల గురించి చెబుతూ భోరున ఏడ్చేసింది. ఇలాంటి సమస్యలను ఎదుర్కొనేందుకు ఒక ప్రత్యేకమైన వ్యవస్థ ఉంటే బాగుండు అని అనిపించింది అఖిలేష్కి. వెంటనే నవనీత్ సకేరా అనే ఒక పోలీసు ఉన్నతాధికారిని పిలిపించి పరిస్థితిని వివరించారు. అలా వారిద్దరి మధ్యా పుట్టిన ఆలోచనే – 1090.

 

ఉత్తర్ప్రదేశ్లో ఆడపిల్లలని ఫోన్లో వేధించే సందర్భాలు చాలా ఎక్కువ. సాధారణంగా అమ్మాయిలు రీచార్జి కోసం ఏదన్నా దుకాణానికి వెళ్లినప్పుడు అక్కడ వారి నెంబర్లను నోట్ చేస్తారు కదా! అలా నోట్ చేసిన నెంబర్లను దుకాణదారులు ఆకతాయిలకు అమ్ముతారట. అమ్మాయి బాగా అందంగా ఉంటే ఆ నెంబరుకి 500 రూపాయల వరకూ చార్జ్ చేస్తారు. ఇలా ‘కొనుక్కున్న’ నెంబర్లకి ఏదో రాంగ్ కాల్ అన్నంత అమాయకంగా ఫోన్ చేయడంతో వేధింపు మొదలవుతుంది. అది క్రమేపీ స్త్రీలను ఉచ్చులోకి దింపేందుకో, వారిని లైంగికంగా వేధించడానికో దారి తీస్తుంది. ఇలా నెంబర్లని ‘కొనుక్కునే’ స్తోమత లేని ఆకతాయిలు మరో విధంగా ఆడవారి నెంబర్లను సేకరించే ప్రయత్నం చేస్తారు. దీనికోసం వరుసగా నెంబర్లకి డయల్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే తమకి ఓ ఆడగొంతు వినిపించిందో... ఇక అప్పటి నుంచీ ఆ నెంబరుని వేటాడటం మొదలుపెడతారు.

 

 

తమని ఫోన్లో ఆకతాయిలు వేధిస్తుంటే ఏం చేయాలో ఉత్తర్ప్రదేశ్ ఆడవారికి తోచేది కాదు. పోనీ పోలీస్ కంప్లయింట్ ఇద్దామంటే... అది ఎక్కడికి దారి తీస్తుందో అన్న భయం, నేరస్తులకు శిక్ష పడుతుందా అన్న అనుమానం వారిని వేధించేవి. కానీ ఇప్పుడు 1090కి ఫోన్ చేస్తే చాలు, వారి సమస్యని ఓ కాల్ సెంటరులోని వ్యక్తులు నమోదు చేసుకుంటారు. తరువాత ఏ నెంబరు నుంచైతే వారు వేధింపులను ఎదుర్కొంటున్నారో, ఆ నెంబరుకి ఫోన్ చేస్తారు. ‘మీ నుంచి వేధింపు కాల్స్ వస్తున్నట్లుగా మాకు ఫిర్యాదు అందింది. తీరు మార్చుకోకపోతే తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది,’ అంటూ హెచ్చరిస్తారు.

 

వేధింపులని ఆపమంటూ పోలీసుల నుంచి ఫోన్ రాగానే రకరకాల స్పందనలు వినిపిస్తాయి. తమకేమీ తెలియదని కొందరు బుకాయిస్తారు, ఆ అమ్మాయంటే తమకి ఇష్టమని మరికొందరు వాదిస్తారు, తప్పయిపోయింది క్షమించమంటూ ఇంకొందరు వేడుకుంటారు. మొత్తానికి చాలా సందర్భాలలో 1090 నుంచి వచ్చే హెచ్చరికతో వేధింపులు ఆగిపోతాయి. అలా కాకుండా ఇంకా వేధింపులు కొనసాగితే మాత్రం సదరు ఆకతాయిలను వారి కుటుంబసభ్యులతో సహా పిలిపించి కౌన్సిలింగ్ను నిర్వహిస్తారు. ఇకమీదట వేధింపులకు పాల్పడనని భగవద్గీత మీద ప్రమాణం చేయించుకుంటారు. మరికొందరు ముదర్లు ఉంటారు. ఈ కౌన్సిలింగ్ స్థాయి దాటిన తరువాత కూడా వేధింపులను కొనసాగిస్తూ ఉంటారు. అలాంటి అరుదైన సందర్భాలలో వారి మీద కేసు నమోదు చేసి ‘మామగారింటికి’ పంపిస్తారు.

 

 

1090 హెల్ప్లైన్ ఏదో కంటితుడుపు చర్యగా మొదలుపెట్టిన వ్యవస్థ కాదు. దీని కోసం బోలెడంతమంది సిబ్బంది పనిచేస్తున్నారు. వీరికి ప్రత్యేకమైన కార్యాలయం ఉంది. ఇంతేకాకుండా 1090 గురించి వాడవాడలా తెలిసేందుకు బోలెడు ప్రచారమూ చేస్తుంటారు. ఫలితం! 2012 నుంచి ఈ ఏడాది ఆరంభం వరకూ 6.81 లక్షల ఫిర్యాదులు అందాయి. వీటిలో ఆకతాయిలు వేధిస్తున్నారంటూ వచ్చే ఆరోపణల దగ్గర్నుంచీ సామాజిక మాధ్యమాల ద్వారా వేధింపుకి గురవుతున్నాం అని వచ్చే ఫిర్యాదుల వరకూ ఉన్నాయి. వీటిలో దాదాపు 98% ఫిర్యాదులను పరిష్కరించడం విశేషం! ప్రస్తుతానికి ఉత్తర్ప్రదేశ్లోని ఆడవారు తమకి ఏదన్నా ఇబ్బంది ఎదురైతే ‘దస్ నబ్బే’ (1090)కి ఫోన్ చేస్తే సరి అని ధీమాగా ఉన్నారు. అంతకంటే మరేం కావాలి!!!

- నిర్జర.