మన్యం లో కాల్పులు..మహిళా మావోయిస్టు మృతి

 

మన్యంలో మావోయిస్టులు తమ ఉనికిని చాటుకున్నారనటానికి అరకు ఘటనే ఉదాహరణ.అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు హతమార్చటంతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది.మన్యంలో విస్తృతంగా తనిఖీలు ముమ్మరం చేశారు.

కిడారి, సోమ హత్యల తర్వాత ఏఓబీలో మావోయిస్టుల ఏరివేతకు సమన్వయంతో పనిచేయాలని ఆంధ్ర, ఒడిశా పోలీసులు ఒక అవగాహనకు వచ్చారు.ఇందులో భాగంగానే ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు అండ్రాపల్లి పంచాయతీ పరిధిలోని అటవీప్రాంతంలో మావోయిస్టులు తారసపడ్డరు.ఈ నేపథ్యంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి.కాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతి చెందింది. మృతి చెందిన మావోయిస్టును మీనాగా భావిస్తున్నారు.ఈమె మావోయిస్టు పార్టీలో డిప్యూటీ కమాండర్‌గా పనిచేస్తున్నారు. మీనా భర్త ఉదరు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా, ఎంకేవీ మల్కన్‌గిరి కోరాపుట్‌ విశాఖ జోన్‌ కార్యదర్శిగా విధులు చేపడుతున్నారు. మహిళా మావోయిస్టు మీనా ఎమ్మెల్యే హత్య కేసులో నిందితురాలు.ఎదురు కాల్పుల్లో మరికొంత మంది మావోయిస్టులు గాయపడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.పోలీసులు నిర్వహించిన ఈ కూంబింగ్‌లో నలుగురు మావోయిస్టులు జయంతి, రాధిక, గీత, రాజశేఖర్‌లను అదుపులోకి తీసుకున్నారు