తెలంగాణలో మళ్లీ భయపెడుతున్న డేంజర్ వైరస్.. గాంధీలో మహిళ మృతి...

తెలంగాణలో మళ్లీ స్వైన్ ఫ్లూ కలకలం మొదలైంది. ఒకవైపు కరోనా టెన్షన్ పెడుతుంటే... మరోవైపు స్వైన్ ఫ్లూ భయపెడుతోంది. హైదరాబాద్లో స్వైన్ ఫ్లూ కేసులు నమోదవుతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే స్వైన్ ఫ్లూ లక్షణాలతో ఒకరు మరణించడంతో... ప్రజలు అలెర్ట్ ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. 

ఇంతకు ముందు స్వైన్ ఫ్లూ కేసులు చలికాలం ఎక్కువగా వ్యాపించేవి... కానీ, ఇప్పుడు ఎండలు మొదలైనా కూడా స్వైన్ ఫ్లూ భయం ప్రజలను వెంటాడుతోంది. ఎండకాలం వస్తున్నా స్వైన్ ఫ్లూ అనుమానంతో పలువురు ఆస్పత్రుల్లో చేరడం ఆందోళన కలిగిస్తోంది. మరోసారి స్వైన్ ఫ్లూ ఎటాక్ చేస్తుందేమోనని ప్రజలు టెన్షన్ పడుతున్నారు. 

ఈ ఏడాదిలో ఇప్పటివరకు గాంధీ ఆస్పత్రిలో 18 స్వైన్ ఫ్లూ కేసులు నమోదు అయ్యాయి. రీసెంట్ గా గాంధీలో ఒక మహిళ స్వైన్ ఫ్లూ సోకి మరణించడంతో... అలెర్ట్ అయ్యామని వైద్య అధికారులు చెప్తున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలకి ఈ వైరస్ సోకే అవకాశం ఎక్కువగా ఉందని.. వైరల్ ఫీవర్ వచ్చినవారు సైతం జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.