బీజేపీకి షాకిచ్చిన ఇండియాటుడే సర్వే.. ఖుషీలో కాంగ్రెస్

 

లోక్‌సభ ఎన్నికలు అంటే ముందుగా గుర్తొచ్చే రాష్ట్రం యూపీ. ఎందుకంటే యూపీలో అత్యధికంగా 80 ఎంపీ స్థానాలు ఉన్నాయి. అందుకే ప్రధాన పార్టీలు యూపీ మీద ప్రత్యేక దృష్టి పెడుతూ ఉంటాయి. గత ఎన్నికల్లో యూపీ ప్రజలు బీజేపీకి పట్టంగట్టారు. అయితే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం బీజేపీకి ముచ్చెమటలు తప్పవట. ఇప్పటికిప్పుడు సాధారణ ఎన్నికలు జరిగితే.. యూపీలోని ఎస్పీ, బీఎస్పీ, ఆర్‌ఎల్‌డీ కూటమి 58 సీట్లు గెలుచుకుంటుందని ఇండియాటుడే- కార్వీ ఇన్‌సైట్స్‌ తాజాగా నిర్వహించిన ‘మూడ్‌ ఆఫ్‌ ద నేషన్‌ సర్వే’ పేర్కొంది. బీజేపీ, దాని మిత్రపక్షం అప్నాదళ్‌ కలిసి 18 సీట్లకే పరిమితమవుతాయని, కాంగ్రెస్‌ 4 సీట్లు గెలుచుకుంటుందని వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీ కూడా జతకడితే కూటమి మరింత బలపడి 75 స్థానాలు గెలుచుకుంటుందని, అప్పుడు బీజేపీకి కేవలం 5 స్థానాలే వస్తాయని అంచనా వేసింది. 

యూపీలో మొత్తం 80 లోక్‌సభ స్థానాలకు 2014లో బీజేపీ 71, అప్నాదళ్‌ 2 స్థానాలను గెలుచుకున్నాయి. వీటికి 43% ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌-2 (7.53% ఓట్లు), ఎస్పీ-5 (22.4%) స్థానాలను గెలుచుకున్నాయి. 19.6% ఓట్లు సాధించిన బీఎస్పీ, 1% ఓట్లు సాధించిన ఆర్‌ఎల్‌డీలు మాత్రం ఖాతా తెరవలేదు. అయితే, ఈసారి ఫలితాలు భిన్నంగా ఉంటాయని తాజా సర్వే పేర్కొంది. బీజేపీ, అప్నాదళ్‌కు ఉమ్మడిగా 36%, ఎస్పీ, బీఎస్పీ, ఆర్‌ఎల్‌డీ కూటమికి 46%, కాంగ్రెస్‌కు 12% ఓట్లు వస్తాయని లెక్కగట్టింది. చూద్దాం మరి ఈ సర్వే నిజమవుతుందో లేదో.