2019 లో జనసేనదే అధికారం

 

జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్ కి సీఎం అవుతాననే కాన్ఫిడెన్స్ రోజురోజుకి పెరిగిపోతున్నట్టుంది. తాజాగా ప్రజాపోరాటయాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న పవన్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తానే సీఎం అవుతానని స్పష్టం చేశారు. ఈ సభలో పవన్ ప్రసంగిస్తూ.. ‘ధవళేశ్వరం కవాతుకు పది లక్షల మంది వచ్చారు. మిగతా పార్టీల్లా డబ్బు, సారా, బిర్యానీ ఇవ్వలేదు. ఏమిస్తే మీ రుణం తీర్చుకోగలను? జనసేన పెట్టి మీకు ఇలా సేవ చేసుకునే భాగ్యం కలిగింది. మనకు ఇప్పుడు మహాత్మాగాంధీ, అంబేద్కర్, నెహ్రూ లాంటి వారెవరూ లేరు.. మనకున్నదల్లా జగన్‌, చంద్రబాబు, లోకేష్ లే. జగన్‌ను చూద్దామంటే ఆయన మీద కేసులున్నాయి. చంద్రబాబును చూస్తే అవినీతి పెరిగిపోయింది’ అని వ్యాఖ్యానించారు.

2014లో చంద్రబాబుకు సపోర్టు చేయడం అప్పటి ధర్మం. 2019లో టీడీపీని రానివ్వకపోవడం ఇప్పటి ధర్మం. ఎన్టీఆర్‌ పెద్దాపురం వద్ద సూరంపాలెంలో 470 ఎకరాల భూముల్ని దళితులకు ఇచ్చారు. ఆ భూముల్ని లాక్కుని టీడీపీ వాళ్లు రెండు వేల కోట్లు దోచుకున్నారు. 'లోకేష్ గారూ.. మీ తాతగారిచ్చిన భూముల్లో మట్టి తవ్వేసి అమ్మేసుకుంటున్నారు. మట్టి అవినీతిని సాక్ష్యాధారాలతో నిరూపిస్తా వస్తారా’ అంటూ సవాల్‌ విసిరారు. ఇలాంటి వాటి గురించి వైఎస్‌ జగన్‌ మాట్లాడరని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో 40 సీట్ల కంటే తక్కువ వచ్చిన వాళ్లు సీఎం కాగలిగారు, ఢిల్లీలో కేజ్రీవాల్‌ గెలిచారు.. ఇవన్నీ బలమైన మార్పునకు సంకేతాలని పవన్ అన్నారు.

పవన్ ప్రసంగిస్తున్న సమయంలో అభిమానులు ‘సీఎం పవర్‌స్టార్‌.. సీఎం పవర్‌స్టార్‌..’ అని అరిచారు. దీనికి పవన్‌ స్పందిస్తూ.. సీఎం పవర్‌స్టార్‌ అంటే అదొక మంత్రం. ఇది ఖచ్చితంగా 2019లో జరిగి తీరుతుంది. సరికొత్త సమీకరణలవల్ల జనసేన అధికారంలోకి వస్తుంది. టీడీపీ ఎట్టి పరిస్థితుల్లో రాదు. జగన్‌ కూడా ప్రభుత్వాన్ని స్థాపించలేరు అని పవన్ స్పష్టం చేశారు.