కేసీఆర్ కే నా ఓటు.. షాక్ లో కాంగ్రెస్, చంద్రబాబు

 

ఓ వైపు చంద్రబాబు బీజేపీయేతర ఫ్రంట్‌ అంటూ కాంగ్రెస్ తో కలిసి నడుస్తూ మిగతా పార్టీలను ఏకం చేయాలని చూస్తుంటే.. మరోవైపు కేసీఆర్ బీజేపీయేతర, కాంగ్రెసేతర ఫ్రంట్ అంటూ ప్రాంతీయ పార్టీలను ఏకం చేయాలని చూస్తున్నారు. కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రయత్నాల్లో భాగంగా ఇప్పటికే నవీన్‌ పట్నాయక్‌, మమతా బెనర్జీలను కలిశారు. వారు ఇంకా తమ వైఖరిపై స్పష్టత ఇవ్వలేదు కానీ.. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ మాత్రం ఇంకా కేసీఆర్ తో భేటీ కూడా కాకుండానే కేసీఆర్‌ ఫ్రంట్‌ కు మద్దతు ప్రకటించారు.

తాజాగా అఖిలేశ్‌ యాదవ్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘బీజేపీని ఢీకొనేందుకు ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు దిశగా కృషి చేస్తున్న కేసీఆర్‌కు అభినందనలు. కేసీఆర్‌ను కలిసేందుకు త్వరలో హైదరాబాద్‌ వెళుతున్నా. ఆయన దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఒక వేదిక మీదకు తీసుకొచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు’ అని కొనియాడారు. తాను కేసీఆర్‌తో ఫోన్లో మాట్లాడానని, 25-26 తేదీల్లో ఢిల్లీలో ఆయనతో భేటీ కావాల్సి ఉందని, వివిధ కారణాల వల్ల ఢిల్లీకి రాలేకపోయానని అఖిలేశ్‌ యాదవ్‌ చెప్పారు.

గతంలో కాంగ్రెస్ పార్టీతో దోస్తీ చేసిన అఖిలేశ్ యాదవ్ ఈ మధ్య కాంగ్రెస్ కు దూరం జరుగుతూ వస్తున్నారు. యూపీలో బీఎస్పీ తో కలిసి పోటీ చేసి.. కాంగ్రెస్‌ను యూపీలో అమేథీ, రాయ్‌బరేలీ సీట్లకే పరిమితం చేయాలని చూస్తున్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం ఎస్పీ, బీఎస్పీ లతో కలిసి పనిచేయాలనుకుంటుంది. దేశ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలని చూస్తున్న అఖిలేశ్ యాదవ్, మాయావతి.. కాంగ్రెస్ ను దూరం పెడుతున్నారు. అందుకేనేమో రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్‌ ప్రభుత్వాల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించినా ఎస్పీ, బీఎస్పీల అధినేతలు హాజరు కాలేదు. ఇప్పుడు అఖిలేశ్ యాదవ్ అనూహ్యంగా కేసీఆర్ ఫ్రంట్ కు మద్దతు ప్రకటించి అటు కాంగ్రెస్ కు, ఇటు చంద్రబాబుకి బిగ్ షాక్ ఇచ్చారు.