హౌడీ మోదీ కార్యక్రమానికి ట్రంప్ ఆలస్యం అందుకేనా...!

 

హ్యూస్టన్ లో జరిగిన హౌడీ మోదీ కార్యక్రమం భారత్ అమెరికా మైత్రికి వేదికగా నిలిచింది. ఇరు దేశాధినేతలు చేసిన ప్రసంగం జనాలు నీరాజనాలు అందుకున్నాయి. హౌడీ మోదీ కార్యక్రమానికి ట్రంప్ గంట ఆలస్యంగా రావడం చర్చ నీయాంశంగా మారింది. భారత కాలమానం ప్రకారం రాత్రి 9:20 సమయానికి మోదీ వేదిక వద్దకు చేరుకోగా ట్రంప్ మాత్రం 10:25 సమయానికి వచ్చారు. అప్పటికే వేదికపై ఉన్న మోదీ స్వయంగా వెళ్లి ట్రంప్ ను వేదిక మీదకు తోడ్కొని వెళ్లారు.

షెడ్యూల్ ప్రకారం ట్రంప్ 9:30 సమయానికి తన ప్రసంగాన్ని ప్రారంభించాల్సి ఉంది కానీ, ఆలస్యంగా రావడంతో మోదీనే ప్రసంగాన్ని ప్రారంభించారు. టెక్సాస్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కుండ పోత వర్షాలు కురుస్తున్నాయి. వరదలతో జన జీవనం అస్తవ్యస్తంగా మారింది, రాష్ట్రవ్యాప్తంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో అక్కడి పరిస్థితిని సమీక్షించేందుకు అనుకోకుండా వెల్లింగ్టన్ వైమానిక స్థావరంలో కాసేపు ఆగారు, దీంతో కార్యక్రమానికి రావడం ఆలస్యమైంది.

హౌడీ మోదీ కార్యక్రమంలో ట్రంప్ ఇరవై ఐదు నిమిషాల పాటు ప్రసంగించారు, మోదీ పాలనపై ప్రశంసలు కురిపించారు. ఆయన సంస్కరణల ఫలితంగా ముప్పై కోట్ల మంది పేదరికం నుంచి విముక్తులయ్యారన్నారు. భారత్, అమెరికా రక్షణ ఉత్పత్తుల భాగస్వాములుగా మారుతున్నాయని సరిహద్దు భద్రత ఇరు దేశాలకు ప్రాధాన్య అంశంగా మారిందన్నారు. ఇస్లామిక్ ఉగ్రవాదం నుంచి అమాయక పౌరులకు రక్షణ కల్పిస్తామన్నారు.