తగ్గుతున్న రెండువేల రూపాయల నోట్ల ముద్రణ అందుకోసమేనా..?

 

రెండు వేల రూపాయల నోటును త్వరలో బ్యాన్ చేస్తారు, గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న మాట ఇది. అయితే అలాంటిదేమీ లేదంటున్నాయి ఆర్బిఐ, కేంద్ర ఆర్థిక శాఖ. పెద్ద నోట్ల రద్దు తరువాత కేంద్రం ప్రవేశ పెట్టిన రెండు వేల రూపాయల నోటును ఉపసంహరించబోతున్నట్లు గత కొంతకాలంగా హల్ చల్ చేస్తున్న వార్తలకు కేంద్రం బలం చేకూర్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్క రెండు వేల నోటును కూడా ఆర్బిఐ ప్రింట్ చేయకపోవడమే ఇందుకు కారణం.

వాస్తవానికి పెద్ద నోట్లుగా చలామణి అయిన 500 రూపాయలు, వెయ్యి రూపాయల నోట్లను 2016 నవంబర్ లో రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. ఆ క్రమంలో నోట్ల కొరతను తగ్గించేందుకు కొత్తగా రెండు వేల రూపాయల నోట్లను విడుదల చేసింది ఆర్బీఐ. అయితే అది కూడా కొద్దికాలమే ఉంటుందని అప్పట్లోనే విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అందుకు అనుగుణంగానే రెండు వేల రూపాయల నోటు ముద్రణ తగ్గిపోతూ వచ్చింది. 2016 -17 ఆర్థిక సంవత్సరంలో 3,542.991 మిలియన్ ల రెండు వేల రూపాయల నోట్లను ప్రింట్ చేసిన ఆర్బీఐ, 2017-18 ఆర్థిక సంవత్సరంలో 111.507 మిలియన్ నోట్లు, 2018-19 సంవత్సరంలో 46.690 మిలియన్ నోట్లను మాత్రమే ప్రింట్ చేసింది. ఈ ఏడాది ఒక్క రెండు వేల రూపాయల నోటును కూడా ఆర్బిఐ ముద్రించలేదు. ఇదే విషయాన్ని సమాచార హక్కు చట్టం కింద ఆర్బీఐ స్పష్టం చేసింది. రెండు వేల రూపాయల నోట్ల వల్ల మనీ ల్యాండరింగ్ కేసులు పెరుగుతున్నట్లు గ్రహించిన కేంద్రం నోట్ల ముద్రణ నిలిపేయాల్సిందిగా ఆర్బీఐని సూచించినట్టు తెలుస్తున్నది. ముద్రణ నిలిపివేసినా నోట్లు చలామణిలోనే ఉంటాయని ఆర్బీఐ స్పష్టం చేసింది.