ఒకే ఉరికంబంపై... ఒకేసారి... నలుగురు ఉరితీత... తీహార్ జైలు సరికొత్త రికార్డు

ఏడేళ్లుగా తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న నలుగురు నిర్భయ దోషులను ఫిబ్రవరి ఒకటిన ఉదయం ‎ఆరు గంటలకు ఉరితీయనున్నారు. ఒకే ఉరికంబంపై... ఒకేసారి... ఒకే సమయంలో... నలుగురినీ ఉరి తీసేందుకు తీహార్ జైల్లో ఏర్పాట్లు పూర్తయిపోయాయి. ఉరిశిక్ష అమలు కోసం తీహార్ జైలు అధికారులు ట్రయల్ రన్ కూడా పూర్తి చేశారు. నిర్భయ దోషుల కోసం ప్రత్యేకంగా సిద్ధంచేసిన ఉరికంబంపై తలారులతో డమ్మీ ఉరితీత ప్రక్రియ నిర్వహించారు. దోషుల ఎత్తు, బరువునకు సమానమైన ఇసుక సంచులను ఉరికొయ్యపై వేలాడదీశారు. అలాగే, ఉత్తరప్రదేశ్ మీరట్ నుంచి తెప్పించిన ఉరితాళ్లు సరిగ్గా ఉన్నాయా? లేదా? సాంకేతిక సమస్యలు ఏమైనా ఉన్నాయా? అంటూ పరిశీలించారు.

ఇదిలా ఉంటే, ఒకేసారి నలుగురిని ఉరి తీయబోతున్న కారాగారంగా తీహార్ జైలు సరికొత్త రికార్డును సృష్టించబోతోంది. భారత్‌లో ఇప్పటివరకు ఒకేసారి ఇద్దరిని మాత్రమే ఉరితీసిన సందర్భాలుండగా... మొదటిసారి నలుగురినీ ఒకే ఉరికంబంపై ...ఒకే సమయంలో ఉరి తీయబోతున్న జైలుగా రికార్డులకెక్కబోతోంది. అయితే, తీహార్ జైల్లో కూడా ఇప్పటివరకు ఒకేసారి ఇద్దరిని మాత్రమే ఉరి తీసేందుకు వీలుండగా... ఇప్పుడు, నలుగురు నిర్భయ దోషులను ఒకేసారి తీయాల్సి ఉండటంతో... ప్రత్యేకంగా ఉరికంబాన్ని సిద్ధంచేశారు. నలుగురినీ ఒకేసారి ఉరితీసేందుకు అనుగుణంగా జేసీబీతో పెద్ద గుంతను తవ్వించారు. అలాగే, ఉరి తీసిన తర్వాత అక్నడ్నుంచి మృతదేహాలను తరలించేందుకు అండర్ గ్రౌండ్ మార్గాన్ని నిర్మించారు.

ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు నిర్భయ దోషులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవడమే కాకుండా... దారులన్నీ మూసుకుపోవడంతో ఫిబ్రవరి ఒకటిన ఉరిశిక్ష అమలు కోసం తీహార్ జైలు అధికారులు మొత్తం ఏర్పాట్లు పూర్తి చేసేశారు. అయితే, నిర్భయ దోషుల్లో ఒకడైన ముఖేష్ సింగ్ మరోసారి సుప్రీంను ఆశ్రయించాడు. సహా దోషి అక్షయ్ సింగ్ తనపై అనేకసార్లు జైల్లో లైంగిక దాడి చేశాడని, ఇదంతా జైలు అధికారుల ప్రోద్బలంతోనే జరిగిందంటూ రిట్ పిటిషన్ వేశాడు. దాంతో, ముఖేష్ పిటిషన్‌పై అత్యవసర విచారణ జరిపిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వులో పెట్టింది. దాంతో, నిర్భయ దోషుల ఉరితీతపై మరోసారి సందిగ్ధత నెలకొంది.