ధూళిపాళ్ల కూడా బాబుకి షాకిస్తారా? మరి, ఎందుకు సైలెంట్ అయ్యారు?

 

ధూళిపాళ్ల నరేంద్ర... గుంటూరు మిర్చిలా ఘాటున్న నాయకుడు... 1994 నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించి... డబుల్ హ్యాట్రిక్ ను తృటిలో మిస్సైన నేత... పొన్నూరులో తిరుగులేని నాయకుడిగా ఎదిగిన ధూళిపాళ్ల... టీడీపీలో ఫైర్ బ్రాండ్ లీడర్ గా... పవర్ ఫుల్ మౌత్ పీస్ గా గట్టిగా పనిచేశారు. అయితే, ఐదుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రి పదవి ఇవ్వలేదన్న మనస్తాపంతో 2017 తర్వాత సెలైన్స్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఇక, 2019 ఎన్నికల్లో ఓటమి చవిచూడటంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కాగడా పెట్టి వెతికినా ఎక్కడా కనబడటం లేదు. కనీసం టీడీపీ కార్యక్రమాల్లో కూడా ధూళిపాళ్ల పాల్గొనడం లేదు. ఇటీవల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్... పొన్నూరు నియోజకవర్గంలో పర్యటించినా... అటువైపు కనీసం కన్నెత్తికూడా చూడలేదు. పార్టీలో నెంబర్-2 లీడర్ తన నియోజకవర్గానికి వస్తే... ఎందుకు వెళ్లలేదని అందరూ మాట్లాడుకుంటున్నారు. 

అయితే, ధూళిపాళ్ల... అయ్యప్పమాల వేసుకున్నారని, అందుకే... పొన్నూరులో ఆత్మహత్య చేసుకున్న భవన నిర్మాణ కార్మికుడు రవి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి రాలేదని ఆయన అనుచరులు అంటున్నారు. నారా లోకేష్ ...రవి కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చినా... అయ్యప్పమాలలో ఉన్నందుకే పాల్గొనలేదని, అంతేగానీ వేరే ఉద్దేశమేమీ లేదని చెబుతున్నారు. చనిపోయినవాళ్ల ఇంటికి అయ్యప్పమాల వేసుకున్నవాళ్లు రాకూడదనే కారణంతోనే రాలేదని ధూళిపాళ్ల అనుచరులు వివరణ ఇస్తున్నారు. అయితే, ఆత్మహత్య చేసుకున్న రవి ఇంటికి రాని ధూళిపాళ్ల... నారా లోకేష్ పొన్నూరు నియోజకవర్గంలో పర్యటించినా ఎందుకు కలవలేదని కొందరు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, ఇసుక కొరత, ఇంగ్లీష్ మీడియం... ఇతర అంశాలపై చంద్రబాబు పెద్దఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపడుతున్నా... ధూళిపాళ్ల ఎందుకు పాల్గొనలేదని, బాబు ఇసుక దీక్షకు సంఘీభావం తెలపలేదని అంటున్నారు. కనీసం గుంటూరు జిల్లాలో చేపట్టిన ఆందోళనల్లో కూడా ధూళిపాళ్ల పాల్గొనకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇక, వల్లభనేని వంశీ, కొడాలి నానిలు తీవ్రస్థాయిలో చంద్రబాబును దూషించినా... ధూళిపాళ్ల ఎందుకు నోరు మెదపడం లేదని తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు.

అయితే, ధూళిపాళ్ల మౌనవ్రతం వహించడానికి అనేక కారణాలు ఉన్నాయని అంటున్నారు. గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారని, అయితే... ఆళ్లపాటి రాజా కూడా పోటీపడుతుండటంతో... అధిష్టానం ఎవరివైపు మొగ్గుచూపుతుందో తెలియక... సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. అంతేకాదు, నారా లోకేష్ ...పొన్నూరు పర్యటన కూడా ఆళ్లపాటి రాజా ఆధ్వర్యంలోనే జరిగిందని, అందుకే ధూళిపాళ్ల దూరంగా ఉన్నారని మాట్లాడుకుంటున్నారు. లోకేష్ కూడా... ఎక్కువగా ఆళ్లపాటి రాజాకు ప్రాధాన్యత ఇస్తున్నారని ధూళిపాళ్ల గుర్రుగా ఉన్నారని చెప్పుకుంటున్నారు. అయితే, మరో మాట కూడా వినిపిస్తోంది. ధూళిపాళ్ల కూడా వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్ బాటలో వెళ్తారనే టాక్ వినిపిస్తోంది. ధూళిపాళ్ల కూడా వైసీపీలో చేరేందుకు రంగంసిద్ధంచేసుకుంటున్నారని అంటున్నారు. కానీ, ధూళిపాళ్ల అనుచరులు మాత్రం ఈ ప్రచారాన్ని కొట్టిపారేస్తున్నారు. తెలుగుదేశానికి ధూళిపాళ్ల వీర విధేయుడని... అధిష్టానంతో కొన్ని సమస్యలున్నా... త్వరలోనే పరిష్కారమవుతాయని అంటున్నారు. మరి, ధూళిపాళ్ల ఎప్పుడు మౌనం వీడతారో... అప్పుడే ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం లభిస్తుంది.