తన ప్రత్యర్థిని గుర్తించలేకపోతున్న కాంగ్రెస్ పార్టీ!!

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ మా రాజకీయ ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీనే అని ప్రకటిస్తున్నప్పటికీ కాంగ్రెస్ నాయకులకు ఇంకా క్లారిటీ రావడం లేదు. అధిష్టానం కూడా బిజెపికి వ్యతిరేకంగా కార్యాచరణ ఇస్తోంది. దేశంలో ఆర్థిక స్థితికి బీజేపీ విధానాలే కారణమంటూ దీక్షలకు పిలుపునిచ్చింది. ఇప్పుడు తాజాగా రిజర్వేషన్లపై కేంద్రం తీరును తప్పుపడుతూ మళ్లీ ఈ నెల 16న ధర్నాలు చేయాలని పిలుపునిచ్చింది. దేశ వ్యాప్తంగా జరిగే ఆందోళనల్లో భాగంగా మండల స్థాయి వరకూ ఆందోళనకు వెళ్లాలని సూచించింది. అధిష్టానం ప్రకటించిన కార్యాచరణపై టి కాంగ్రెస్ లో భిన్నాభిప్రాయాలున్నాయి. అసలు విషయాలను వదిలేసి అనవసర విషయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారనే వాదన కూడా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తన ప్రత్యర్థిని గుర్తించలేకపోతుందనే  అభిప్రాయానికి నేతలు వచ్చేశారు. 

తెలంగాణలో అధికార టీ ఆర్ ఎస్ పార్టీకి ప్రత్యర్థి పార్టీ మాత్రం కాంగ్రెస్సే కానీ, ఇటీవల బిజెపి హడావుడి చేస్తూ మేమే ప్రత్యామ్నాయం అంటూ నిలబడే ప్రయత్నం చేస్తోంది. కానీ, కాంగ్రెస్ మాత్రం ప్రత్యర్థి పార్టీ అనే విషయాన్ని మర్చిపోయినట్టే ఉంది. రాష్ట్ర స్థాయిలో ఉద్యమ కార్యాచరణ అంతా కాంగ్రెసు టీ ఆర్ ఎస్ మధ్య ఉండేలా ప్లాన్ చేసుకోవాల్సింది కానీ, రాష్ట్రంలో ఇప్పటివరకూ అంతగా ప్రభావితం చూపని బీజేపీ లక్ష్యంగా ఆందోళనలు చేయటంతో బిజెపి, కాంగ్రెస్ మధ్య ఫైట్ గా మారిపోయి అధికార టీ ఆర్ ఎస్ పార్టీ లాభపడుతుందన్న అభిప్రాయంతో కొందరు నాయకులు ఉన్నారు. టీ ఆర్ ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడం మానేసి బీజేపీని టార్గెట్ చేయడం వల్ల రాజకీయంగా కాంగ్రెస్ కు వచ్చే లాభమేమీ ఉండదనే వాదన ఉంది. 

ఇటీవల కేంద్ర బడ్జెట్ మీద మాజీ కేంద్ర మంత్రి చిదంబరంతో సెమినార్ నిర్వహించారు. దీంట్లో కూడా ఎక్కువగా బీజేపీ లక్ష్యంగానే కార్యాచరణ జరిగింది. బీజేపీని వదిలేసి తెలంగాణలో ప్రత్యర్థి పార్టీ సీఎం కేసీఆర్ లక్ష్యంగా సమస్యలపై పోరాటం చేస్తే ఉద్యమాలకు ఊతమిచ్చినట్టవుతుందని దాంతో కాంగ్రెస్ కేసీఆర్ ను బలంగా ఢీ కొట్టే ప్రయత్నం చేస్తుందనే టాక్ జనంలోకి వెళుతోంది. ఇది రాజకీయంగా కాంగ్రెస్ కి కలిసొచ్చే అంశం, కొందరు సీనియర్ లు కూడా ఇదే రకమైన అభిప్రాయంతో ఉన్నారు. తెలంగాణలో రాజకీయ అవసరాలు ప్రత్యర్థి ఎవరన్నది గుర్తించి ఉద్యమాలు చేయాలన్నదే ప్రధాన అంశం. ఇప్పటివరకు టీ ఆర్ ఎస్, బీజేపీ ఒక్కటే అని చెప్పినా ఆశించిన రీతిలో కాంగ్రెస్ కు వర్కౌట్ కాలేదు. కానీ, టి ఆర్ ఎస్ లక్ష్యంగా ఉద్యమాలు చేయడం మానేసి ఏఐసీసీ ఇచ్చే కార్యాచరణకే పరిమితం కావడంపై నేతలు అసంతృప్తిగా ఉన్నారు.