బాలకృష్ణ భయపడుతున్నారా? రాజధానిపై ఎందుకు మాట్లాడటం లేదు?

నవ్యాంధ్ర రాజధాని అమరావతి రణరంగంగా మారింది. రాజధాని రైతులు, మహిళలు దాదాపు నెల రోజులుగా పెద్దఎత్తున ఉద్యమిస్తున్నారు. మహిళలైతే పిల్లలతో సహా రోడ్లపైకి వచ్చి తమ ఆవేదనను తెలుపుతున్నారు. తిండీతిప్పలు మానేసి పెద్దఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. పోలీస్ ఆంక్షలను సైతం లెక్కచేయకుండా, లాఠీ దెబ్బలను తట్టుకుంటూ అమరావతి కోసం పోరాడుతున్నారు. పోలీసుల యాక్షన్ తో వందలాది మంది మహిళలు తీవ్రంగా గాయపడుతున్నారు. మొత్తంగా అమరావతి గ్రామాల్లో నెల రోజులుగా ఒక యుద్ధమే జరుగుతోంది. అయితే, ఇంత జరుగుతున్నా, నందమూరి బాలకృష్ణ కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం చర్చనీయాంశమైంది. అమరావతి కోసం రైతులు, మహిళలు, పిల్లలూ అందరూ రోడ్లపైకి వచ్చి పోరాడుతుంటే నందమూరి నట రాజకీయ వారసుడు మాత్రం ఒక్క మాటా మాట్లాడకపోవడం సంచలనంగా మారింది. 

ఒకవైపు బావ చంద్రబాబు... మరోవైపు అల్లుడు నారా లోకేష్... అమరావతి రైతులకు అండగా పెద్దఎత్తున పోరాడుతున్నారు. అక్క భువనేశ్వరి సైతం రాజధాని ప్రజలకు మద్దతుగా ఒకరోజు ధర్నాలో పాల్గొని తన ప్లాటినం గాజులను ఉద్యమానికి విరాళం ఇచ్చారు. ఇలా కుటుంబం మొత్తం రాజధాని రైతులకు అండగా ఉద్యమిస్తుంటే... యాంగ్రీ మ్యాన్ బాలకృష్ణ ఎక్కడా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక, చంద్రబాబు అయితే, ఎన్నడూలేనివిధంగా ఏఖంగా జోలె పట్టి ఉద్యమం కోసం విరాళాలు సేకరిస్తూ ఊరూరా తిరుగుతూ రాజధాని ఉద్యమాన్ని ఒక ఆయుధంగా మలుచుకోవాలని చూస్తుంటే, బాలయ్య మాత్రం ఇప్పటివరకూ ఒక్క మాటా మాట్లాడకపోవడం అమరావతి రైతులనే కాదు, తెలుగుదేశం శ్రేణులనే విస్మయానికి గురిచేస్తోంది.

అయితే, బాలయ్య మౌనానికి కారణాలున్నాయంటున్నారు. మూడు రాజధానులపై ఏది మాట్లాడినా తనకు ఇబ్బందేనని భావిస్తున్నారట. అమరావతిలోనే రాజధాని ఉండాలంటే, రాయలసీమలో బాలయ్యకు ఇబ్బందులు తప్పవంటున్నారు. హిందూపురం ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న బాలకృష్ణకు, రాజధాని వ్యవహారం నిజంగా తలనొప్పిలా మారిందంటున్నారు. టీడీపీలో బాలయ్య కీలక నాయకుడైనా, తాను ప్రాతినిధ్యం వహిస్తున్నది రాయలసీమ నుంచి కావడంతో, ఇక్కడ తన పట్ల ప్రజల్లో వ్యతిరేకభావం ఏర్పడుతుందని ఆలోచిస్తున్నారట. అందులోనూ సీమలోనే బాలయ్యకు ఫ్యాన్స్‌ ఎక్కువ. సీమ నేపథ్యంలో వచ్చిన సమరసింహారెడ్డి వంటి చిత్రాలు బాక్సాఫీసు రికార్డులు తిరగరాశాయి. అందుకే మూడు రాజధానుల టాపిక్‌లో తలదూర్చితే, అటు నియోజకవర్గంలోనూ, ఇటు సీమలో ఫ్యాన్స్‌పరంగానూ ఇబ్బందేనని నందమూరి హీరో లెక్కలేస్తున్నారట.

ఇక ఉత్తరాంధ్రలోనూ ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ఇక్కడా నందమూరి అభిమానులకు లెక్కేలేదు. పార్టీ విధానం ప్రకారం, విశాఖను పరిపాలనా రాజధానిగా వ్యతిరేకిస్తే, ఇక్కడా బాలయ్యకు ఇబ్బందే. రాజకీయంగా, సినిమాలపరంగా కూడా చిక్కులు తప్పవు. ఎందుకంటే, తన చిన్నల్లుడు భరత్‌ ...విశాఖ నుంచే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. తాను అమరావతిని సమర్థిస్తూ, విశాఖను వద్దంటే చిన్నల్లుడి పొలిటికల్‌ కెరియర్ కి ఇబ్బందులు వస్తాయని భావిస్తున్నారట. అందుకే అటు రాయలసీమ, ఉత్తరాంధ్రను హర్ట్‌ చెయ్యకుండా, మౌనమే మేలనుకుంటున్నారట బాలకృష్ణ. ఒకవేళ మూడు రాజధానులకు బాలయ్య ఓకే అంటే, ఇటు కృష్ణా, గుంటూరులో మరింత ఇబ్బంది. కృష్ణా తమ కుటుంబానికి సొంత జిల్లా కావడం, తమ సామాజికవర్గం బలంగా వుండటంతో, అమరావతిని వ్యతిరేకించలేని పరిస్థితి బాలయ్యది. మూడు ప్రాంతాలూ తనకెంతో కీలకమైనవిగా భావిస్తున్న  నందమూరి హీరోకి, ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారింది మూడు రాజధానుల వ్యవహారం. అందుకే అన్నింటికీ మౌనమే మేలనుకుంటున్నారని తెలుస్తోంది.