వంశీ స్ట్రోక్.. గన్నవరంలో ఇంచార్జ్ నియామకంలో జాప్యం చేస్తున్న టిడిపి

కృష్ణా జిల్లా రాజకీయాల్లో గరంగరంగా ఉంటుంది గన్నవరం నియోజకవర్గం. గన్నవరం తమ కంచుకోటగా భావిస్తుంటారు టిడిపి నాయకులు. పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన ఎన్నికల్లో అత్యధికంగా ఐదు సార్లు గన్నవరం నుంచి విజయం సాధించింది టిడిపి. 2019 ఎన్నికల్లో ఫ్యాను గాలికి జంకలేదు గన్నవరం. గన్నవరం నుంచి వరుసగా రెండోసారి టిడిపి ఎమ్మెల్యేగా గెలిచారు వల్లభనేని వంశీ. కానీ గెలిచిన ఆరు నెలలకే సీఎం జగన్ కు జైకొట్టి వంశీ వెళ్లిపోవడంతో టీడీపీ కేడర్ లో స్తబ్దత నెలకొంది. వంశీ అధికారికంగా వైసీపీ తీర్థం పుచ్చుకోనప్పటికీ అసెంబ్లీలోనే కాకుండా బయట కూడా టిడిపి, చంద్రబాబు, లోకేష్ ల పై విమర్శలతో ఆయన విరుచుకుపడుతున్నారు. ఆరేళ్లుగా గన్నవరం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఆ నియోజకవర్గంలో టిడిపికి కార్యాలయం లేదు. సొంత కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకొని తన ముద్ర కోసం ప్రయత్నించారు వంశీ. వైసీపీకి జై కొట్టిన తర్వాత వంశీతో కొద్ది మంది మాత్రమే నడిచారు. ఎన్నికల కంటే ముందుగానే కొందరు టిడిపి కార్యకర్తలు వైసీపీ శిబిరంలో చేరి పోయారు. గన్నవరంలో ఇంకా బలమైన క్యాడర్ ఉందని భావిస్తున్న టిడిపికి అక్కడ ఇన్ చార్జి కరువయ్యారు. పార్టీ అభిమానులను, కార్యకర్తలను ముందుకు నడిపించే నాయకత్వం లేదు. 

గన్నవరంలో టిడిపి ఇన్ ఛార్జిగా వ్యవహరించేందుకు పార్టీలో కొందరు పోటీ పడుతున్నారు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు భార్య కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ గద్దె అనురాధ ఈ బాధ్యతలను ఆశిస్తున్నారు. గద్దె రామ్మోహన్ రావుది గన్నవరం కావటంతో పాటు గతంలో ఆయన ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. అనురాధ సైతం గన్నవరం జడ్పీటీసీగా గెలిచి జెడ్పి చైర్ పర్సన్ అయ్యారు. ఈ నియోజకవర్గంలో పరిచయాలు ఉండడంతో ఆమెనే ఇన్ చార్జి పదవి వరిస్తుందని పార్టీ వర్గాలు అనుకుంటున్నాయి. అయితే మరో నేత పుట్టగుంట సతీష్ నుంచి ఆమెకు గట్టి పోటీ ఉంది.ఇద్దరు నేతలు గట్టిగా పోటీ పడుతుంటే వారిలో ఎవరో ఒకరిని ఎంపిక చేస్తే కేడర్ హుషారుగా ఉంటుంది. ఒకవేళ వీళ్లు సరిపోరని అనుకుంటే కొత్త వారిని ఎంపిక చేయాలి. సహజంగా ఇలా పక్క పార్టీకి వెళ్ళిన వారికి పోటీగా నేతలను పెట్టి తిట్టించడం సర్వసాధారణం. మేము ఇంచార్జులుగా ఉంటామని ఇద్దరు నేతలు ముందుకు వచ్చినా తటపటాయిస్తున్నారు చంద్రబాబు.ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఒకవైపు స్థానిక ఎన్నికలు ముంచుకొస్తునన్నాయి. ఇటు చూస్తే నియోజకవర్గంలో పార్టీని నడిపించే నాయకుడు లేడు. ఇంకా జాప్యం చేస్తే ఉన్న కేడర్ తలో దిక్కూ చూడటం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే వంశీ ఇచ్చిన స్ట్రోక్ తో టిడిపి కంచుకోటకు పగుళ్లు వచ్చాయి. మరి ఆ పగుళ్ళకు చంద్రబాబు పూత పూస్తారో లేక కోట కూలిపోయే వరకు వేచి చూస్తారో కాలమే సమాధానం చెబుతుంది.