ఎవరీ బీసీ రాయ్.. డాక్టర్స్ డే ఎలా వచ్చింది?

ముందు వరుసలో నిలబడి వైద్యసేవలందిస్తూ..
మన దేశంలో 1622 మందికి ఒక డాక్టర్..
ప్రజలు- డాక్టర్ల నిష్పత్తిలో పాకిస్తాన్ కన్న వెనుకబడి..

మందులు వ్యాధులను నయం చేస్తాయి. కానీ, డాక్టర్లు మాత్రమే రోగులను నయం చేయగలుగుతారు.
- కార్ల్ జంగ్

మతాలు వేరైనా.. కులాలు వేరైనా అందరూ చేతులెత్తి మొక్కేది డాక్టర్ కే. కనిపించని దేవుడు ప్రాణం పోస్తే కనిపించే వైద్యుడు ఆ ప్రాణాలను కాపాడుతాడు. అందుకే  వైద్యో నారాయణో హరి అన్న నానుడి వచ్చింది. అన్ని వృత్తుల్లోకి డాక్టర్ వృత్తి అంటే ఎనలేని గౌరవం ప్రజల్లో ఈ నాటికీ ఉంది. ప్రపంచవ్యాప్తంగా అధికశాతం ప్రజలు కోవిడ్ 19 కారణంగా మృత్యువు అంచులదాక వెళ్లుతుంటే వారిని తమ ప్రాణాలకు తెగించి కాపాడుతున్నది డాక్టర్లే. ఈ విప‌త్క‌ర సమ‌యంలో సేవ చేస్తూ ప్రాణాలు కోల్పోతున్న వైద్యసిబ్బంది సంఖ్య తక్కువేమీ కాదు. త‌మ కుటుంబాల‌కు దూరంగా ఉంటూ, కరోనా బాధితుల‌కు 24/7 సేవ‌లందిస్తున్నారు.  కేవలం ఆరోగ్యాన్నే కాదు రోగుల్లో మానసిక స్థైర్యాల్ని అందిస్తున్న ఈ వైద్య నారాయణులకు  డాక్టర్స్ డే సందర్భంగా అక్షరాభిషేకం. అంతకన్న వారి రుణం మనం ఎలా తీర్చుకోగలం...

ఇలామొదలైంది..
ప్రతి ఏడాది జూలై 1వ తేదీని జాతీయ వైద్యుల దినత్సవంగా నిర్వహిస్తాం. ఇందుకు కారణం వైద్యసేవకే వన్నెతెచ్చిన బీసీరాయ్. ఆయన జన్మదినం, మరణించిన రోజూ రెండూ జూలై1. అందుకే ఆయన స్మారకార్థం ప్రతీ ఏడాది జూలై ఒకటన తేదీన వైద్యుల దినోత్సవంగా నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాదు ఆయన పేరు మీద వివిధ రంగా ల్లో సేవలు అందించిన వారికి 1976 నుంచి అవార్డులు అందిస్తున్నారు. 

ఎవరీ బీసీ రాయ్..
వైద్యరంగంలో ఉన్నవారందరికీ, వృత్తిని దైవంగా భావించే వారందరికీ మార్గదర్శి డాక్టర్‌ బీసీ రాయ్‌. ఆయన పూర్తి పేరు బిధాన్‌ చంద్రరాయ్‌. 1882 జులై 1న బీహార్‌ రాష్ట్రంలోని బంకింపూర్‌లో ఆయన జన్మించారు. కలకత్తా మెడికల్‌ కళాశాలలో మెడిసిన్‌, 1909లో ఇంగ్లాండ్‌ లోని బర్త్‌ హోమ్‌ హాస్పిటల్‌లో ఎం.ఆర్‌.సి.పి, ఎఫ్‌.ఆర్‌. సీ.ఎస్‌ డిగ్రీలు పూర్తిచేశారు. 1911లో స్వదేశానికి తిరిగొచ్చి కలకత్తా వైద్య కళాశాలలో అధ్యాపకుడిగా చేరారు. పేదలకు వైద్య సేవలు అందించాలన్న ఆశయంతో ఆయన జాదవ్‌ పూర్‌ టీ.బీ హాస్పిటల్, ఆర్‌.జి.ఖార్‌ మెడికల్‌ కాలేజ్, విక్టోరియా ఇనిస్టిట్యూట్, చిత్తరంజన్‌ క్యాన్సర్‌ హాస్పిటల్‌ తదితర వైద్య సంస్థల్ని ఏర్పాటుచేశారు. అంతేకాదు వైద్యరంగంలో వస్తున్న పోకడలకు ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేసేలా ఎన్నో వ్యాసాలు రచించారు. 1922 - 1928 మధ్య కాలంలో కలకత్తా మెడికల్‌ జర్నల్‌కు ఎడిటర్‌గా ఉన్నారు. కలరా విజృంభించిన సమయంలో వేలాదిమంది ప్రాణాల్ని ఆయన కాపాడారు. జాతిపిత మహాత్మా గాంధీకి వైద్యుడిగా, స్నేహితుడిగా ఉంటూ ఆయన ఆశయాలకు వెన్నంటి నడిచారు. ఆ తర్వాత 1928లో అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ సభ్యులుగా చేరి ఆ తర్వాత అంచెలంచెలుగా రాజకీయంగా ఎదిగి 1948 జనవరి 13న పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ముఖ్యమంత్రి అయ్యాక కూడా రోజూ సాయంత్రం కొంత సమయాన్ని వైద్య సేవలకు కేటాయించారు. 1961లో ఫిబ్రవరి 4న ఈయన భారత రత్న అందుకున్నారు. వైద్యుడిగా సేవలందిస్తూ సిఎంగా ప్రజల మధ్యనే ఉన్న ఆయన  1962 జూలై 1న మరణించారు. ఆయన గౌరవార్థమే  1991 నుంచి జూలై 1న డాక్టర్స్ డేను భారత ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి ఏటా కొత్త నినాదంతో డాక్టర్ డేను నిర్వహిస్తున్నారు.

ప్రజలు - డాక్టర్ నిష్పత్తి
మనదేశంలో వైద్యుల కొర‌త ఎక్కువగా ఉంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ తన నివేదికలో ప్రకటించింది. ప్రతి 1622 మంది ప్రజలకు ఒక డాక్టర్ అందుబాటులో ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారస్స్ ల ప్రకారం ప్రతి వెయ్యి మందికి ఒక డాక్టర్ ఉండాలి. ప్రజలు డాక్టర్ నిష్పత్తి లో మన దేశం 57వ స్థానంలో ఉంది. తమ పొరుగుదేశం పాకిస్తాన్ కన్నా మనం వెనుకబడే ఉన్నాం.
భారత్ లో 1000 : 0.62
పాకిస్తాన్ లో 1000 : 0.89
బంగ్లాదేశ్ లో 1000 : 0.91
అత్యధికంగా ఆస్ట్రేలియాలో 1000 : 3.37 ఉన్నారు.
ఎదుటి వ్యక్తి ప్రాణాలు కాపాడడానికి తపన పడే వాడే నిజమైన వైద్యుడు. కానీ, వైద్యం వ్యాపారంగా మారిన ప్రస్తుత తరుణంలో డాక్టర్లు కూడా తయారు చేయబడుతున్నారు.
మానవ సేవే మాధవ సేవ అన్నట్లు సాగే వైద్య వృత్తిలో ధనాపేక్ష లేకుండా సేవాభావంతో పనిచేస్తున్నవారి సంఖ్యే ఎక్కువ. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ముందువరుసలో నిలబడి ఈ మహమ్మారిని ఎదుర్కోంటూ రోగులకు సేవలందిస్తున్న డాక్టర్లకు మరోసారి పాదాభివందనం.