కనిపించని కొండా దంపతులు.. భూపాలపల్లిలో కలవరపడుతున్న కార్యకర్తలు!!

కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం అంటే ముందుగా గుర్తొచ్చే పేరు కొండా మురళి. ఒకప్పుడు కొండా మురళి పేరు చెబితే కాంగ్రెస్ క్యాడర్ కి కొండంత ధైర్యం వచ్చేది. ఎన్నికలు ఏవైనా కొండా మా అండ అంటూ జండాలు పట్టుకొని ధూంధాం చేసేవారు. ఎన్నికల్లో గెలుపు ఓటములకు అతీతులుగా హల్ చల్ చేసే వారు. కానీ మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆనాటి ఉత్సాహమే కనిపించడం లేదు. భూపాలపల్లి మునిసిపాలిటీ పోరులో అన్ని రాజకీయ పార్టీలతో పాటు పలుకుబడి ఉన్న స్వతంత్రులు సైతం దూసుకుపోతూండగా కాంగ్రెస్ పార్టీ మాత్రం డీలా పడిపోయింది. ఒక వైపు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మరోవైపు బిజెపి నేత చందు పట్ల కీర్తి రెడ్డి ఇప్పటికే టౌన్ లో ప్రచారం మొదలుపెట్టారు. బస్తీల్లో జెండాలతో ర్యాలీలు కూడా నిర్వహిస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం నడిపించే నాయకుడు లేక నిరుత్సాహంలో మునిగిపోయింది. 

గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి విజయం సాధించిన గండ్ర వెంకటరమణారెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావుకు భూపాలపల్లి నియోజక వర్గ బాధ్యతలు అప్పగించింది కాంగ్రెస్ అధిష్టానం. కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే మునిసిపాలిటీలో టికెట్లు ఖరారు చేస్తుంటే ఇక్కడ మాత్రం కొండా మురళి పట్టించుకోవడం లేదని కార్యకర్తలు అంటున్నారు. భూపాలపల్లి మునిసిపాలిటీ ఎన్నికల బాధ్యతలు కూడా మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పై పడింది. కొండ అందుబాటు లోకి రాకపోవడంతో శ్రీధర్ బాబు జోక్యం చేసుకోవలసి వస్తోంది. అయితే శ్రీధర్ బాబు ప్రభావం భూపాలపల్లిలో ఉండదని క్యాడర్ చెబుతోంది. కొండా మురళి కానీ, సురేఖ కానీ తమ తరపున ప్రచారం చేస్తే గెలిచే అవకాశాలుంటాయని కార్యకర్తలు చెబుతున్నారు. అయితే కొండా దంపతులు మాత్రం భూపాలపల్లి వైపు కన్నెత్తి చూడడం లేదు.