విత్తన సంక్షోభం : గత ప్రభుత్వ నిర్లక్ష్యమా....ఈ ప్రభుత్వ అనుభవలేమా ?

ఏపీ ప్రభుత్వ అనుభవ లేమి ప్రతి విషయంలోనూ కొట్టోచ్చిన్నట్టు కనిపిస్తోంది. ఏపీ ప్రభుత్వం పాలన మొదలుపెట్టి నెల రోజులయింది. అయితే ఈ ప్రభుత్వానికి మొట్టమొదటి దెబ్బ రైతుల నుండే తగిలింది. విత్తనాల లేమితో  రైతులందరూ రోడ్ల మీదకు వచ్చే పరిస్థితి ఎదురయింది. తడ నుండి ఇచ్చాపురం దాకా విత్తనాల సమస్య తీవ్రంగా ఉంది. ఇప్పటికే పలు చోట్ల రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. విత్తన పంపిణీ కేంద్రాల వద్ద రైతులు బారులు తీరుతున్నారు. పడిగాపులు పడుతున్నారు. కానీ విత్తనాలు మాత్రం అందడం లేదు. అయితే విత్తన సమస్యను తీర్చే చర్యల గురించి చెప్పాల్సిన మంత్రి టీడీపీ ప్రభుత్వం మీద నిందలేసి తాము పరిశుద్దులం అనిపించుకునే ప్రయట్నం చేస్తున్నారు. 

ఈ నెల రోజుల్లో వ్యవసాయ సీజన్‌ కు రైతులకు కావాల్సినవి అందుబాటులో ఉంచారో, లేదో మాత్రం సమీక్ష చేయలేకపోయారు ఏపీ మంత్రి వర్యులు. అవినీతి మీద సమీక్ష అంటూ సమయం వృధా చేసిన సర్కార్ ఒక్క రోజంటే ఒక్క రోజు కూడా వ్యవసాయ సమస్యలపై సమీక్షించలేదు. ఫలితంగా విత్తన సంక్షోభం రైతులను ఏడిపిస్తోంది. ఏదో ఒకటి చేసి విత్తనాలు రైతులకు ఇవ్వాల్సిన సర్కారు గత ప్రభుత్వం దగ్గర ప్రణాళికే లేదని, నాణ్యమైన విత్తనాల పంపిణీలో గత ప్రభుత్వం విఫలమయిందని మంత్రి కన్నబాబు చెప్పుకొస్తున్నారు. విత్తన సేకరణకు, పంపిణీకి గత ప్రభుత్వానికి.. ఒక స్పష్టమైన కార్యాచరణ లేదని మండిపడ్డారు.

అయితే సుమారుగా 25 రోజుల క్రితమే మంత్రిగా బాధ్యతలు తీసుకున్న కన్నబాబు, వ్యవసాయశాఖ శాఖ మీద పట్టు సాదించలేకపోయారు అని చెప్పవచ్చు. రాష్ట్రంలో ఉన్న రైతులకు ఎన్ని క్వింటాళ్ల విత్తనాలు పంపించేయాలి మన దగ్గర ఎన్ని క్వింటాళ్ల విత్తనాలు ఉన్నాయి అని వ్యవసాయశాఖ అధికారులు దగ్గర సమాచారం ఉంటుంది, కానీ అవి ఏమి తెలుసుకోకుండా మంత్రి అట్టహాసంగా జూన్ 15 తేదీన విత్తన పంపిణీ ప్రారంభించారు. అయితే విత్తన పంపిణీ విషయంలో వ్యవసాయశాఖ వైఫల్యం చెందడంతో రైతులు రాస్తారోకోలు, ధర్నాలకు దిగారు. 

ఆలస్యంగా మేలకున్న మంత్రి కన్నబాబు చంద్రబాబు మీదకే నెపం నెట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు విత్తనాల కోసం 10 రోజుల్లో మరో వెయ్యి కోట్లు విడుదల చేస్తామని గొప్పగా ప్రకటించారు. ఎక్కువ ధర ఇచ్చైనా నాణ్యమైన విత్తనాలు సేకరిస్తామని చెబుతున్నారు. ఈ ఏడాది 4.43 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను పంపిణీ చేయాల్సి ఉంటే తమ ప్రభుత్వం ఏర్పడేనాటికి 50 వేల క్వింటాళ్లనే సేకరించారన్నారు. తాము అధికారంలోకి వచిన తర్వాత 2.70 లక్షల క్వింటాళ్లను సిద్ధం చేసి రైతులకు అందజేశామని, మరో 50 వేల క్వింటాళ్లను అందుబాటులో ఉంచినట్టు చెబుతున్నారు. ఇది జగన్ ప్రభుత్వ అనుభవ లేమితోనే జరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు.