ఢిల్లీలో కర్ఫ్యూ.. త్వరలో తెలంగాణలోనూ..!

ఢిల్లీలో వీకెండ్ కర్ఫ్యూ. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకూ కర్ఫ్యూ విధిస్తున్నట్టు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. మాల్స్, జిమ్స్, ఆడిటోరియం, స్పా మూసివేయాలని ఆదేశించారు. థియేటర్స్‌లో సీటింగ్‌ను 30శాతానికి కుదించారు. రెస్టారంట్లలో కేవలం హోం డెలివరీకి మాత్రమే అనుమతి.  వివాహాలకు కర్ఫ్యూ పాస్‌లు జారీ చేస్తారు. అత్యవసర సేవలు మాత్రం అందుబాటులో ఉండనున్నాయి. 

ప్రజలంతా కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు సీఎం కేజ్రీవాల్. మాస్క్‌లు లేకుండా కన్పించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆసుపత్రుల్లో ఎలాంటి పడకల కొరత లేదన్నారు. ఐదు వేలకు పైగా పడకలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. 
  
ఉదయం దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌, ఇతర ఉన్నతాధికారులతో భేటీ అయిన అనంతరం కేజ్రీవాల్‌ ఈ ప్రకటన చేశారు. ‘‘ప్రజల ఆరోగ్యం దృష్ట్యానే ఈ ఆంక్షలు విధించాల్సి వస్తోంది. వీటి వల్ల మీరు ఇబ్బంది పడతారని తెలుసు.. కానీ, వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవాలంటే ఆంక్షలు అత్యవసరం’’ అని సీఎం కేజ్రీవాల్ వీడియో ప్రసంగంలో అన్నారు. మీడియా కూడా సంయమనం పాటించాలని, ప్రజలను ఆందోళనకు గురి చేయొద్దన్నారు. 

అటు.. తెలంగాణలోనూ కరోనా కేసులు పెరుగుతుండటంతో రాత్రి కర్ఫ్యూ దిశగా ఆలోచిస్తోంది కేసీఆర్ సర్కారు. ఇప్పటికే ఢిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, యూపీ లాంటి రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. తెలంగాణలోనూ రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తే ఎలా ఉంటుందనే అంశంపై సీఎస్ సోమేష్ కుమార్ అన్ని శాఖల ముఖ్య అధికారులతో సమీక్షిస్తున్నారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ తుది నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.