నువ్వైనా ఒకటే నేను మూడు ఇస్తా..!

 

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన కామెంట్స్‌కు చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తే తామేమీ చేతులు ముడుచుకుని కూర్చోలేదని, కేసీఆర్ ఒక గిఫ్ట్ ఇస్తే, తాము మూడు గిఫ్ట్‌లు ఇస్తామన్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో స్పీకర్ కోడెల శివప్రసాదరావుతో కలిసి ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య, ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించారు. తారకరామ సాగర్, ఎన్టీఆర్ గార్డెన్స్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మీద విరుచుకుపడ్డారు.

"సీనియర్ మోడీ, తెలంగాణ మోడీ, కోడికత్తి మోడీ ముగ్గురూ కలిశారు. గద్దల మాదిరిగా రాష్ట్రం మీద వాలారు. రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించాలని చూస్తున్నారు. కేసీఆర్ ఇష్టం వచ్చినట్టు నోరుపారేసుకుంటున్నారు. ఆంధ్ర ప్రజల మీద, నాయకుల మీద నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇక్కడ కులాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారు. కేసీఆర్ నా దగ్గర పెరిగిన వ్యక్తి. నన్నే తిడుతున్నాడు. ఆయనేదో రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడంట. మనం చేతగానివాళ్లమా? నువ్వు ఒకటిస్తే.. మూడు గిఫ్ట్‌లు తిరిగి ఇస్తాం. వదిలిపెట్టే ప్రసక్తే లేదు." అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ పక్కన అవినీతి తమ్ముడు జగన్‌ చేరారని విమర్శించారు. వీరిద్దరు ఏకమైనా రాష్ట్రాన్ని, తనను ఏమీ చేయలేరని స్పష్టం చేశారు. న్యాయం చేస్తారని నమ్మితే ఎన్డీఏ నమ్మక ద్రోహం చేసిందని సీఎం మండిపడ్డారు.