పాకిస్తాన్‌ క్రికెట్‌ పదేళ్లు వెనుకబడి ఉంది- అక్రం

 

టి-20 ప్రపంచ కప్‌లో భారత చేతిలో ఓడిపోయిన పాకిస్తాన్‌ జట్టు విమర్శల జల్లులో తడుస్తోంది. తాజాగా ఆ దేశ మాజీ కేప్టెన్‌ పాకిస్తాన్‌ ఆటతీరు మీదా, అక్కడి క్రికెట్ బోర్డు మీదా నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. పాకిస్తాన్‌ క్రికెట్‌కు సంబంధించిన ఏ సలహా కావాలన్నా, ఏ సాయం చేయాలన్నా తాను సిద్ధంగా ఉన్నాననీ.... కానీ బోర్డులోని కొందరికి ఇది నచ్చదని అక్రం పేర్కొన్నాడు. తాను ఇంతటి వాడినయ్యానంటే దానికి కారణం తన దేశమే కానీ, ఆ దేశంలోని క్రికెట్‌ బోర్డు కాదని వెక్కిరించాడు. ప్రస్తుతం పాకిస్తాన్‌ ఆటతీరు బాగోకపోవడానికి ఎవరో ఒకరి మీద కారణాన్ని మోపడం సరికాదన్నాడు అక్రం. పాకిస్తాన్‌ ఆట ప్రమాణాలే దారుణంగా ఉన్నాయనీ, ఇతర దేశాలతో పోలిస్తే తమ ఆట పదేళ్లు వెనకబడిపోయిందనీ చెప్పుకొచ్చాడు. ఇందుకోసం దేశవాళీ క్రికెట్‌ నుంచి కూడా మార్పులను తీసుకురావాలని సూచించాడు. మరోవైపు బోర్డు సభ్యులు అక్రం మాటలకు మండిపడుతున్నారు. అక్రం పాకిస్తాన్‌ క్రికెట్‌ వ్యవహారాలలో అనవసరంగా తలదూరుస్తున్నాడనీ, మ్యాచ్‌ ఫిక్సింగ్‌ వివాదాల్లో ఇరుక్కున్న అక్రం తమకు సలహాలు ఇవ్వడమేమిటనీ విసుక్కుంటున్నారట!