బాబు టార్గెట్ గా వైసీపీ... జగనే లక్ష్యంగా టీడీపీ... ఏపీలో హైఓల్టేజ్ ఐటీ వార్... 

ఐటీ రైడ్స్‌పై ఏపీలో హైఓల్టేజ్ పొలిటికల్‌ వార్ జరుగుతోంది. అధికార వైసీపీ... ప్రతిపక్ష తెలుగుదేశం... పరస్పరం కత్తులు దూసుకుంటున్నాయి. చంద్రబాబు టార్గెట్‌గా మంత్రులు ఘాటు కామెంట్స్ చేస్తుంటే.... ముఖ్యమంత్రి జగన్‌ లక్ష్యంగా రివర్స్ కౌంటరిస్తోంది టీడీపీ. అయితే, ఐటీ రైడ్స్ వ్యవహారంలో చంద్రబాబును కార్నర్ చేసేందుకు అధికార వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందుకే, మంత్రుల నుంచి ముఖ్యనేతల వరకు అందరూ బాబు టార్గెట్ గా చెలరేగిపోతున్నారు. ఏపీ రైడ్స్ లో బయటపడ్డ అక్రమాస్తులన్నీ చంద్రబాబువేనంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు.

మాజీ పీఎస్‌ ఇంట్లోనే 2వేల కోట్లు అక్రమాస్తులు దొరికితే... ఇక, చంద్రబాబును పట్టుకుంటే... ఎన్ని లక్షల కోట్లు దొరుకుతాయోనంటూ... మాటల తూటాలు వదులుతున్నారు. ఇప్పుడు లాగింది తీగ మాత్రమేనని డొంక చాలా పెద్దగుందంటూ ఐటీ అధికారుల మాదిరిగా స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. అంతేకాదు, ఆంధ్రా అవినీతి అనకొండ చంద్రబాబు... అంటూ ఘాటైన పంచ్‌ డైలాగులు పేల్చుతున్నారు. అయినా, తన మాజీ పర్సనల్ సెక్రటరీ ఇంట్లో జరిగిన ఐటీ దాడులపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నిస్తున్నారు. నిప్పునని చెప్పుకునే చంద్రబాబు ...ఇప్పటికైనా నోరు విప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

అయితే, వైసీపీ కామెంట్స్‌కు తెలుగుదేశం నేతలు దీటుగా కౌంటర్ ఇస్తున్నారు. అసలు, ఐటీ దాడులతో టీడీపీకి సంబంధమేంటంటూ యనమల ప్రశ్నించారు. అవినీతిలో కూరుకుపోయిన జగన్మోహన్ రెడ్డి... అందరినీ అందులోకి లాగేందుకు చూస్తున్నారని దేవినేని ఉమా మండిపడ్డారు. ఇక, నారా లోకేష్ కూడా వైసీపీ నేతలపై సెటైర్లు వేశారు. చంద్రబాబులో లేని అవినీతిని వెతకడం కంటే గుడ్డుపై ఈకలు పీకడం ఈజీ అంటూ అధికార పార్టీకి కౌంటరిచ్చారు.

మొత్తానికి, తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఐటీ దాడులు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. చంద్రబాబు అవినీతి బట్టబయలైందంటూ అధికార వైసీపీ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుంటే.... దొంగే ...దొంగన్నట్లుగా జగన్ పార్టీ నేతల తీరు ఉందంటూ తెలుగుదేశం స్ట్రాంగ్ కౌంటరిస్తోంది.