పోసాని వర్సెస్ పృథ్వీ... పెయిడ్ కామెంట్స్ పై రచ్చరచ్చ

ఒకరేమో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ... మరొకరేమో టాలీవుడ్ రాజాధి రాజా పోసాని... ఇద్దరూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు హార్డ్‌కోర్‌ లీడర్సే... జగన్మోహన్ రెడ్డికి వీరాభిమానులే... అయితే, వీళ్లిద్దరి మధ్య రాజధాని వివాదం చిచ్చురేపింది. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం నడుస్తోంది. అయితే, ప్రస్తుతం ఎస్వీబీసీ చైర్మన్ గా ఉన్న పృథ్వీ అమరావతి రైతులపై చేసిన కామెంట్లు రచ్చరచ్చ అవుతున్నాయి. అమరావతిలో పెయిడ్‌ ఆర్టిస్టులతో రైతు ఉద్యమం జరుగుతోందన్న పృథ్వీ.... వారు సాధారణ రైతులైతే ఆడి కార్లు, మహిళల చేతులకు బంగారు గాజులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. పేరుకే అది రైతుల పోరాటమని, కానీ అక్కడ నడుస్తున్నది కార్పొరేట్ ఉద్యమం అన్నారు. అయితే, పృథ్వీ చేసిన ఈ వ్యాఖ్యలపై అమరావతి మహిళా రైతులు భగ్గుమన్నారు. పృథ్వీ దిష్టిబొమ్మలను తగలబెట్టారు. మహిళా ఆందోళనకారులను కించపరిచేలా మాట్లాడిన పృథ్వీ, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

అయితే, పృథ్వీ కామెంట్లపై, పోసాని కృష్ణమురళి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మహిళా రైతులను కించపరిచే వ్యాఖ్యలేంటని ప్రశ్నించారు. జగన్‌ సర్కారును అప్రదిష్టపాలు చేస్తోంది పృథ్వీలాంటివారేనంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రెస్ మీట్ మొత్తం పృథ్వీనే టార్గెట్ చేశారు పోసాని. ఒకవైపు జగన్‌ను పొగుడుతూనే, మరోవైపు పృథ్వీలాంటి వారివల్లే, జగన్‌కు చెడ్డపేరు వస్తోందని బ్యాలెన్స్‌డ్‌‌గా పంచ్‌లు కురిపించారు. ఒకవిధంగా చెప్పాలంటే పృథ్వీని తనదైన స్టైల్లో మాటలతో ఆటాడేశారు పోసాని.

పోసాని విమర్శలకు కొంచెం ఆలస్యంగా స్పందించినా... ఘాటుగానే రియాక్టయ్యారు పృథ్వీ. అమరావతిలో ఆందోళనలు చేస్తున్నది ముమ్మాటికీ పెయిడ్ ఆర్టిస్టులేనంటూ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. తాను పార్టీ స్టాండ్ ప్రకారమే మాట్లాడానన్న పృథ్వీ.... క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదన్నారు. అయినా, ఎవరో అడిగితే తాను సమాధానం చెప్పాలా అంటూ పోసానికి రివర్స్ కౌంటర్ ఇఛ్చారు. తన వల్ల పార్టీ నష్టపోతుందని తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఫైరైన పృథ్వీ.... పోసానికి దమ్ముంటే ఏదైనా వేదికపైకి వచ్చి మాట్లాడాలని సవాలు విసిరారు. వ్యవసాయం చేసే రైతులను తాను పెయిడ్ ఆర్టిస్టులని అనలేదని, కానీ అమరావతిలో ఆందోళనలు చేస్తున్నవాళ్లు మాత్రం ముమ్మాటికీ పెయిడ్ ఆర్టిస్టులేనని అన్నారు. తనతోపాటు నటించిన పలువురు అమరావతి ఆందోళనల్లో ఉన్నారని పృథ్వీ చెప్పుకొచ్చారు. అయితే, పోసాని కామెంట్స్ కు పృథ్వీ స్ట్రాంగ్ కౌంటరివ్వడంతో... ఈ వివాదం ఎటువైపు వెళ్తుందో చూడాలి.