జగన్ సర్కార్ పై మరో అంతర్జాతీయ పత్రిక సంచలన కథనం!!

ఆంధ్రప్రదేశ్ సీఎంగా వైఎస్ జగన్ అధికారాన్ని చేపట్టినప్పటి నుంచి చాలా వినూత్నంగా దూసుకుపోతున్నారు. అయితే జగన్ తీసుకుంటున్న పలు నిర్ణయాలు విమర్శలకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా విపక్షాలు ఆయనపై విరుచుకుపడుతున్నాయి. దీనికి తోడు, ఏపీలో విపక్షం విమర్శలే కాకుండా అంతర్జాతీయ స్థాయి పత్రికల విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు వైఎస్ జగన్. తాజాగా అంతర్జాతీయ స్థాయిలో మరోసారి జగన్ ప్రభుత్వం విమర్శలపాలైంది. మొన్నటికి మొన్న పోలవరం పెండింగ్ బిల్లులు చెల్లించలేదంటూ జర్మనీ కంపెనీ ఏపీ ప్రభుత్వం పరువు తీస్తే.. తాజాగా పెండింగ్ బిల్లులు చెల్లించడం లేదంటూ జగన్ ప్రభుత్వంపై పునరుత్పాదక ఇంధన శక్తి కంపెనీలు చేసిన ఆరోపణలు కాస్త అంతర్జాతీయ మీడియాకెక్కాయి.

వాడుకున్న విద్యుత్ కు ఏపీ ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని ఉత్పత్తి కంపెనీలు చెబుతున్నాయంటూ అమెరికాలోని ప్రముఖ వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ వ్యాసం రాసింది. ప్రపంచ వ్యాప్తంగా సోలార్ విద్యుత్ వినియోగంపై కథనం రాసిన వాల్ స్ట్రీట్ జర్నల్ ఈ సందర్భంగా ఇండియాలో తాజా పరిస్థితుల గురించి కూడా చర్చించింది. దశాబ్ద కాలంగా భారత ప్రభుత్వం పునరుత్పాదక ఇంధన శక్తిపై సీరియస్ గా దృష్టి సారించిందని సౌర విద్యుత్ విషయంలో పెద్ద కలలు ఉన్నాయని చెప్పింది. 2030 నాటికల్లా 450 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్ధ్యాన్ని సాధించాలనే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం పెట్టుకుందని వివరించింది. 

అయితే ఈ లక్ష్యాలను సాధించడంలో ఎదురవుతున్న అడ్డంకులను ప్రస్తావిస్తూ దేశవ్యాప్తంగా సోలార్ విద్యుత్ కంపెనీలకు 1.3 బిలియన్ డాలర్ లు బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని తెలిపింది. అందులో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ లో పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేసింది వాల్ స్ట్రీట్ జర్నల్. సోలార్ విద్యుత్ ను అధికంగా వినియోగించుకోవడంలోనే కాదు కంపెనీలకు బకాయిలు చెల్లించే విషయంలోనూ అగ్ర స్థానంలో ఏపీ ఉందంటూ పరువు తీసింది. ఏపీ విద్యుత్ పంపిణీ కంపెనీలు విద్యుత్ బిల్లులను సరిగ్గా చెల్లించకుండా వేధిస్తున్నాయని రాసుకొచ్చింది. తక్కువ ధరకు సరఫరా చేయకపోతే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేసుకుంటామని ఏపీ ప్రభుత్వం చేసిన ప్రకటనను కూడా వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రస్తావించింది. ఇప్పటికే పీపీఏలు రివర్స్ టెండరింగ్ నిర్ణయాలపై పలుచోట్ల విమర్శలు వ్యక్తమయ్యాయి. విద్యుత్ ఒప్పందాలను పునః సమీక్షించాలన్న నిర్ణయంపై అటు భారత ప్రభుత్వం కూడా ఏపీని తప్పుపట్టింది. ఈ నిర్ణయం దేశంలో పెట్టుబడులపై కూడా ప్రభావం చూపుతుందని కేంద్ర పెద్దలు ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వాన్ని ఒకటి రెండు సార్లు కేంద్రప్రభుత్వం కూడా ఈ విషయంలో హెచ్చరించిన విషయం తెలిసిందే.