పరిపాలనా రాజధానిపై విశాఖ వాసుల భిన్నాభిప్రాయాలు

ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధానిగా వైజాగ్ ను ప్రకటించడంపై విశాఖ వాసుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా చేయడం వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని, అదే సమయంలో విశాఖ మరింత అభివృద్ధి చెందుతుందని అంటున్నారు. అయితే, ఇప్పటికే అభివృద్ధి చెందిన వైజాగ్ లో అభివృద్ధి చేసేందుకు ఏమీ లేదని మరికొందరు అంటున్నారు. అసలు పరిపాలనా వికేంద్రీకరణతో అభివృద్ధి సాధ్యంకాదని కొందరు అంటుండగా... రాజధాని అనే పేరే విశాఖ నగరం మరింత అభివృద్ధి చేసేందుకు ఉపయోగపడుతుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.  

ఇప్పటికే అభివృద్ధి చెందిన విశాఖ నగరానికి దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని... దాంతో, ఇప్పుడు కొత్తగా జరిగే అభివృద్ధి ఏముంటుందని అంటున్నారు. పరిపాలనా వికేంద్రీకరణతో పాలనా సౌలభ్యమే తప్ప... అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇక, కొత్తగా పరిశ్రమల ఏర్పాటుపై ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటేనే తప్ప... ఉపాధి అవకాశాలు కూడా పెద్దగా ఉండవని అంటున్నారు. కేవలం పాలనకే విశాఖను పరిమితం చేయకుండా అభివృద్ధిపై దృష్టిపెట్టాలని కోరుతున్నారు. రాష్ట్రంలో ఏ నగరానికీ లేనన్ని ప్రత్యేకతలు విశాఖకు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుంటే... అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని అంటున్నారు. ముఖ్యంగా పర్యాటకరంగంపై దృష్టిపెడితే ఎంతోమందికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయని విశాఖ వాసులు అభిప్రాయపడుతున్నారు.

టూరిజం, ఫుడ్, కన్-స్ట్రక్షన్, ఐటీ, ఫార్మా రంగాలపై మరింత ఫోకస్ పెడితే ఉపాధి అవకాశాలు పెరగడంతోపాటు ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఆగిపోతాయని... ప్రత్యక్షంగా, పరోక్షంగా పెద్దఎత్తున ఉద్యోగాలు దొరుకుతాయని అంటున్నారు. విశాఖ బ్రాండ్ ను సద్వినియోగం చేసుకుంటే దేశంలోనే నెంబర్ వన్ నగరంగా అభివృద్ధి చెందడం ఖాయమంటున్నారు. అలాగే, ఒక్క విశాఖకే అభివృద్ధిని పరిమితం చేయకుండా... అన్ని ప్రాంతాలకూ విస్తరించాలని వైజాగ్ వాసులు కోరుతున్నారు. అయితే, అభివృద్ధి అంటే కేవలం భవనాలు, కార్యాలయాలే కాదని, ప్రజలు సుఖసంతోషాలతో జీవించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచిస్తున్నారు.