వైజాగ్ కి మొహం చాటేసిన సినీపరిశ్రమ

 

ఇంతకు ముందు తెలంగాణా ఉద్యమాలు ఉదృతంగా సాగుతున్నప్పుడు, రాష్ట్ర విభజన తరువాత తెలుగు సినీ పరిశ్రమ ఏదో ఒకనాడు వైజాగ్ కి తరలిరాక తప్పదని అందరూ అనుకొన్నారు. దానికి తగ్గట్లే వైజాగులో నిత్యం ఏదో ఒక చోట సినిమా వాళ్ళు షాట్ రెడీ...యాక్షన్...కట్...అంటూ కెమెరాలు అవీ వేసుకొని హడావుడిగా తిరుగుతూ కనబడేవారు. కానీ ఇప్పుడు వాళ్ళందరూ వైజాగ్ మొహమే చూడటం మానేశారు. కారణం హూద్ హూద్ తుఫాను వల్ల వైజాగ్ లో పచ్చదనం అంతా పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా, నగరంలో చాలా చోట్ల మరమత్తులు, సుందరీకరణ పనులు పూర్తికాకపోవడమే.

 

దానితో ‘మేము సైతం’ మొహం చాటు వేస్తాము అంటూ మన సినీ జనాలు పక్కన ఉన్న ఏ తమిళనాడుకో లేకపోతే ఏ కేరళాకొ వెళ్లి పని పూర్తి చేసుకొని వచ్చేస్తున్నారు. దాని వలన సినిమా షూటింగుల మీద ఆధారపడిన వందలాది జూనియర్ ఆర్టిస్టులు, షూటింగులకి అవసరమయిన అనేక రకాలయిన సామాగ్రి సరఫరా చేసేవారు ఉపాధి కోల్పోయారు. ఒకప్పుడు నెలకి ఆరేడు వేలు సంపాదించుకొని బ్రతికే జూనియర్ ఆర్టిస్టులు ఇప్పుడు రోడ్ల మీద అరటిపళ్ళు అమ్ముకొంటూ, షాపింగ్ మాల్స్, సినిమా హాళ్ళ వద్ద వాచ్ మ్యాన్లుగా జీవనం సాగిస్తున్నారు. సినిమా షూటింగులు ఆగిపోవడం వలన కేవలం వారికొకరికే నష్టం జరిగిందనుకొంటే పొరపాటు.

 

సినిమా షూటింగుల ద్వారా వైజాగ్ నగరపాలక సంస్థకీ చాలా భారీ ఆదాయం వచ్చేది. వైజాగ్ లో ఒక పెద్ద సినిమాకి పాటను చిత్రీకరించాలంటే రోజుకి రూ. ఆరు నుండి ఏడు లక్షలు, అదే చిన్న సినిమాలకయితే రూ.ఒకటి నుండి రెండు లక్షలు ఖర్చవుతుంది. అందులో ఎంత లేదన్నా ఫీజులు, పన్నుల రూపంలో నగరపాలక సంస్థకు కనీసం 10 నుండి 20 శాతం ఆదాయం వచ్చేది. కానీ అదిప్పుడు కోల్పోవలసి వస్తోంది.

 

నగరంలో పచ్చదనం తీసుకు రావడం జీ.వి.యం.సి. చేతిలో లేకపోవచ్చును. కానీ పడిపోయిన విద్యుత్ స్తంభాలను నిలబెట్టి వెలిగించడం, గోతులు పడ్డ రోడ్లను రిపేర్లు చేయడం, షూటింగులు ఎక్కువగా జరిగే రామకృష్ణా బీచ్, భీమిలి బీచ్, రుషికొండ బీచ్, యారాడ బీచ్, ఎర్రమట్టి దిబ్బలు, కైలాసగిరి, సింహాచలం తదితర ప్రాంతాలలో రిపేర్లు, సుందరీకరణ పనులు పూర్తి చేయకపోవడం వలన సినీ పరిశ్రమ వైజాగ్ కి మొహం చాటేసింది.

 

హూద్ హూద్ తుఫానుకు కొన్నినెలల ముందు రామకృష్ణా బీచ్ వద్ద తీరం కోసుకుపోయి సముద్రం నీళ్ళు రోడ్డు మీదకు వచ్చేసినంత పనయినప్పుడు అధికారులు మనృలు అందరూ హడావుడి చేసారు. నాలుగు లారీల బండరాళ్ళు పోసి చేతులు దులుపుకొన్నారు తప్ప నానాటికీ కుచించుకు పోతున్న తీరానని ఏవిధంగా కాపాడుకోవాలి? మళ్ళీ దానిని యదా స్థితికి ఏవిధంగా తేవాలి? రాష్ట్రానికి భారీ ఆదాయం సమకూరుస్తున్న ఈ బీచ్ లన్నిటినీ ఏవిధంగా సుందరంగా తీర్చిదిద్దాలని ఆలోచన చేయకపోవడం చాల దురదృష్టకరం. ఏదో ఒక విపత్తు జరిగితే అందరూ వచ్చి హడావుడి చేయడం తప్పితే శాశ్విత పరిష్కారాలు ఎన్నడూ చేయడం లేదు. వైజాగ్ ని స్మార్ట్ సిటీగా తీర్చి దిద్దడం మాట అటుంచి నడిరోడ్డు మీద ఒరిగిపోయున్న విద్యుత్ స్థంబాలను తొలగించి, గోతుల పడ్డ రోడ్లను రిపేర్లు చేయించి, వీధుల్లో లైట్లు వెలిగిస్తే అదే పదివేలనుకొనే పరిస్థితి నెలకొని ఉంది.

 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నగరంలో ఉన్నంత వరకు ఉరుకులు పరుగుల మీద పనులు పూర్తి చేసిన అధికారులు ఇప్పుడు నత్తనడకన పనులు పూర్తిచేస్తున్నారు. అందువల్ల ఇప్పుడు సినిమా షూటింగులు కూడా ఆగిపోయాయి. దానితో నగర పాలక సంస్థకు భారీ ఆదాయం కూడా కోల్పోతోంది. అయినప్పటికీ వారు పనిచేస్తున్న వేగం చూస్తుంటే మరో ఒకటి రెండేళ్ళ వరకు ఇక సినీపరిశ్రమ వైజాగ్ మొహం చూడవలసిన అవసరంలేదని అనిపిస్తోంది. ముఖ్యమంత్రి దగ్గరుండి పనులు చేయిస్తే తప్ప అధికారులు పనులు చేయలేమని భావిస్తే అంతకంటే అవివేకం ఉండబోదు. జిల్లా మంత్రులు, యంపీలు, యం.యల్యే.లు, పారిశ్రామికవేత్తలు, వ్యాపార వేత్తలు అందరూ నడుంబిగించి పూనుకొంటే తప్ప వైజాగ్ ఇంత త్వరగా తేరుకోలేదు.