విశాఖలో విందు.. అచ్చట అన్ని ఆవు నూనెతోనే చేయబడును

 

ఆవు కనిపిస్తే దండం పెడతాము.. గోవును తాకి కళ్ళకు అద్దుకుంటాము.. మూడు ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతలను పూజించినట్టేనని భావిస్తాము.. కానీ విశాఖ జిల్లా అనకాపల్లిలో మాత్రం అత్యంత క్రూరంగా ఆవులను చంపేస్తున్నారు. ఆవు మాంసం కోసం ఏకంగా సంతలకు వెళ్లి మరీ కొనుగోళ్లుచేస్తున్నారు. ఇదంతా కేవలం మాంసం కోసమే అనుకుంటే పొరపాటే ఎందుకంటే మాంసం అమ్మగా మిగిలిన కొవ్వుతో నూనెలు తయారు చేస్తున్నారు. ఈ నూనెను ఎక్కడో కాదు విశాఖకే సప్లై చేస్తున్నారు. ఎవరికి అనుమానం రాకుండా డబ్బాల్లో నింపుతూ సరఫరా చేస్తున్నారు. కొన్నిసార్లు మంచి నూనెలో కలిపి మరీ అమ్ముతున్నారు. 

విశాఖలో ఆవు కొవ్వుతో తయారైన నూనె వాడుతున్నారని ఎవరికీ తెలియదు. ఏమో రోడ్డు మీద మీరు తినే పకోడిలు, మిర్చి బజ్జీలు, వేడి వేడి సమోసాలు ఆవు కొవ్వు నుండి తీసిన నూనె తోనే తయారు చేస్తున్నారేమో. ఎందుకంటే ఆవుల్ని చంపి కొవ్వు తీసి దాని నుంచి నూనె తయారు చేసి రోడ్డుపై తినుబండారాలు అమ్మే షాపులకు అమ్ముతున్నామని స్వయంగా ఒప్పుకున్నారు. పైగా పామాయిల్ కంటే తక్కువ రేటుకే వస్తుండటంతో వ్యాపారులు కూడా ముందూ వెనుక చూడకుండా కొనేస్తున్నారు. 

అనకాపల్లి నుంచి విశాఖ వెళ్లే దారిలో సుంకరమెట్ట వద్ద నిత్యం జన సంచారం ఉండే ప్రాంతంలో ప్రభుత్వం లక్షలాది రూపాయల వ్యయంతో స్లాటర్ హౌస్ ను నిర్మించింది. ఈ భవనంలో గోవధ చేస్తూ కొవ్వుతో నూనె తయారు చేసి డబ్బాలో నింపుతున్నారు. ఎవరికి అనుమానం రాకుండా ఉండేలా భవనం గేట్లను మురికిగా ఉన్న వస్త్రాలతో కప్పేశారు. బయటి నుంచి చూసేవాళ్ళు బిల్డింగ్లో ఏమీ జరగడం లేదని లోపల ఏమి లేదు అనిపించేలా ఉంటుంది. 

వార్డు పర్యటనలో భాగంగా జీవీఎంసీ జోనల్ కమిషనర్ శ్రీరామమూర్తి స్లాటర్ హౌస్ వైపు వచ్చారు. భయంకరమైన దుర్వాసన చెత్తా చెదారంతో ఉండటంతో వెళ్లి చూశారు, చూసి షాకయ్యారు. పదేళ్ల క్రితం నిర్మించిన భవనంలో ఏం జరుగుతుందో ఇప్పటి వరకూ గుర్తించలేని స్థితిలో ఉన్నామా అనుకున్నారు అధికారులు. స్లాటర్ హౌస్ లో చిక్కిన నిందితుడు కొల్లి సూరిబాబును అధికారులు పోలీసులకు అప్పగించారు. ఈ వ్యాపారంలో ఎవరెవరి పాత్ర ఉంది ఎంత ఉంది అనే దానిపైన దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో వేపచేదు రమణ అనే వ్యక్తి ప్రమేయం ఉందని గుర్తించిన పోలీసులు అతని పైన కేసు నమోదు చేశారు. సబ్బుల్లో ఆవు కొవ్వుతో తయారు చేసే నూనెను వాడుతారని వారికి ఈ నూనెను అమ్ముతున్నామని విచారణలో నిందితులు చెప్పారు. ఇది ఎవరికి అమ్ముతున్నారన్న కోణంలోనూ విచారణ జరుపుతున్నారు.