నేడు విచారణకు రానున్న సైకో శ్రీనివాసరెడ్డి కేసు.. ఉరిశిక్ష వేస్తారా?

నల్గొండ జిల్లా హజీపూర్ సీరియర్ కిల్లర్ శ్రీనివాసరెడ్డి కేసు ఈరోజు విచారణకు రానుంది. హజీపూర్‌లో గతేడాది వెలుగులోకి వచ్చిన బాలికల వరుస హత్యలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. బాలికలను హత్యాచారం చేసి పొలంలోని పాడుబడిన బావిలో కప్పెట్టాడు. ఈ విషయం చాలా ఆసల్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసు తెలుగు రాష్ట్రాలలో ఒక్కసారిగా కలకలం రేపింది. నిందితుడు శ్రీనివాస్ ని అరెస్ట్ చేసిన పోలీసులు అన్ని సాక్ష్యాలు సేకరించారు.

ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే వాదనలు కూడా ముగిశాయి. ఈ హత్యలను శ్రీనివాసే చేశాడని చెప్పేందుకు పక్కా ఆధారాలు ఉన్నాయని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇప్పటికే కోర్టుకు నివేదించారు. నిందితుడికి ఉన్న నేరచరిత్ర దృష్ట్యా ఈ కేసును అత్యంత అరుదైనదిగా పరిగణించి, అతనికి మరణశిక్ష విధించాలని గత విచారణలో ఆయన కోర్టును కోరారు. నిందితుడి తరపు న్యాయవాది మాత్రం బాలికల వరుస హత్యలకు, తన క్లైంట్‌కు సంబంధం లేదన్నారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను జనవరి 17 కి వాయిదా వేసింది. ఈరోజు తిరిగి విచారణ ప్రారంభం కానుండడంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఆ సైకో కిల్లర్ కి ఉరిశిక్ష విధించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి.