తెరాస అభ్యర్థికి నిరసన సెగ.. గ్రామస్థులపై కార్యకర్తల దాడి

 

ప్రచారానికి వెళ్తున్న తెరాస నేతలకు నిరసన సెగలు తగులుతూనే ఉన్నాయి. ఎన్నికల తేదీ సమీపిస్తున్న వేళ నిరసన సెగలు తెరాసను కళవెరపెడుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెరాస తాజా మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ప్రచారంలో చేదు ఘటన చోటుచేసుకుంది. చుండ్రుగొండ మండలం సీతాయిగూడెంలో ప్రచారానికి వెళ్లిన తాటి వెంకటేశ్వర్లును గ్రామస్థులు అడ్డుకున్నారు. పదవిలో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా గ్రామానికి రాలేదని, ఇప్పుడు ఓట్ల కోసం వచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. దీంతో తెరాస కార్యకర్తలకు, గ్రామస్థులకు మధ్య వాగ్వాదం జరిగింది. సహనం కోల్పోయిన కార్యకర్తలు గ్రామస్థులను చితకబాదారు. ఎమ్మెల్యే మైక్‌లో సర్దిజెబుతున్నా వినకుండా స్థానికులపై దాడి చేసారు.

అయితే తాటి వెంకటేశ్వర్లకు ఆయన ప్రచారం మొదలుపెట్టినప్పటి నుంచి నిరసన సెగలు తగులుతూనే ఉన్నాయి. ఆయన ఏ గ్రామంలో ప్రచారం చేపట్టినా స్థానికుల నుంచి నిరసనలు తప్పడం లేదు. పదవిలో ఉన్నప్పుడు సమస్యలు చెప్పినా పట్టించుకోలేదని, ఇప్పుడు ఓట్ల కోసం తమ గ్రామాల్లోకి వస్తున్నారంటూ స్థానికులు తిరగబడుతున్నారు. దీంతో పోలీసుల సంరక్షణలో ప్రచారం చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

మహబూబాబాద్ జిల్లాలో కూడా తెరాసకు చేదు అనుభవం ఎదురైంది. మహబూబాబాద్ జిల్లా గంగారాం మండలం కోమట్లగూడెంలో తెరాస ప్రచార రథాన్ని స్థానికులు అడ్డుకున్నారు. అటవీశాఖ అధికారులు భూములు లాక్కుని నిలువనీడ లేకుండా చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రచార రథం ఫ్లెక్సీలను చించేశారు. ప్రచార రథం తిరగకుండా అడ్డుకోవడంతో పాటు నాయకులతో వాగ్వాదానికి దిగారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే గ్రామాల్లోకి నాయకులు ప్రచారానికి వెళ్లాలంటే భయపడేలా ఉన్నారు. చూద్దాం ముందు ముందు నేతలకు ఇంకెలాంటి చేదు అనుభవాలు ఎదురవుతాయో.